తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: CBI Case on IT officers: అధికారాన్నిఅడ్డం పెట్టుకుని రహస్య సమాచారాన్ని బయటకు లీక్ చేస్తూ భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డ అయిదుగురు ఆదాయపు పన్ను శాఖ అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. వీరికి సహకరించిన ఓ చార్టెడ్ అకౌంటెంట్ పై కూడా కేసులు పెట్టింది. వివరాల్లోకి వెలితే ఇలా, భారీ మొత్తాల్లో ఆదాయపు పన్ను చెల్లించాల్సిన వారి వివరాలతో ఇన్ కమ్ టాక్స్ అధికారులు ప్రతీ యేటా ఓ లిస్ట్ తయారు చేస్తారు.
ఈ జాబితా ఆదాయపు పన్ను శాఖ వరకే పరిమితమై ఉంటుంది. ఈ క్రమంలోనే 2023, జూన్ లో ఓ జాబితాను రూపొందించారు. కొన్నిరోజుల తరువాత ఈ జాబితాను రికార్డుల్లో నుంచి తొలగించాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. అయితే, ఆదాయపు పన్ను శాఖలో పని చేస్తున్న ఖుమర్ ఆలం ఖాన్, మనీష్ సిక్రవాల్ ఈ లిస్టును డిలీట్ చేయకుండా తమ పర్సనల్ కంప్యూటర్లలో భద్రపరుచుకున్నారు. అనంతరం గుల్నాజ్ రవూఫ్, కుత్తాడి శ్రీనివాస రావు, మహ్మద్ జావేద్ లతో కలిసి డబ్బు వసూళ్ల కు శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగా లిస్టులో ఉన్నవారికి నేరుగా ఫోన్లు చేస్తూ మీరు ఆదాయపు పన్ను సక్రమంగా చెల్లించలేదు కాబట్టి భారీ స్థాయిలో పెనాల్టీలు విధించే అవకాశాలు ఉన్నాయని చెప్పి బెదిరించటం మొదలు పెట్టారు. అవతలి వారిని నమ్మించటానికి అధికారపు ఈ మెయిల్ అడ్రస్ ద్వారా మెయిల్ పంపించారు.
Also Read: Telangana Police: అయ్యబాబోయ్.. 70వేల మొబైల్ ఫోన్ల రికవరీ.. ఎలా చేశారంటే?
వీరికి వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన పులిమామిడి భగత్ సహకరిస్తూ వచ్చాడు. పెనాల్టీ పడకుండా ఉంటాలంటే తాము చెప్పినట్టుగా చేయాలంటూ అయిదుగురు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమ తమ ఖాతాల్లోకి డిజిటల్ పేమెంట్ల ద్వారా 20వేల నుంచి లక్ష రూపాయలు జమ చేయించుకున్నారు.
ఈ మేరకు సమాచారం అందటంతో కేసులు నమోదు చేసి విచారణ చేపట్టిన సీబీఐ ఖుమర్ ఆలంఖాన్, మనీష్ సిక్రవాల్, గుల్నాజ్ రవూఫ్, కుత్తాడి శ్రీనివాస రావు, మహ్మద్ జావేద్ లు ఈ అక్రమాలకు పాల్పడినట్టు నిర్ధారించారు. వీరికి చార్టెడ్ అకౌంటెంట్ పులిమామిడి భగత్ సహకరించినట్టు తేల్చారు.
ఈ క్రమంలో ఆరుగురిపై బీఎన్ఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. కాగా, ఈ అక్రమాల్లో మరికొందరి పాత్ర కూడా ఉన్నట్టుగా సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జారీ చేసిన ఎఫ్ఐఆర్ లో ఈ ఆరుగురితోపాటు ఇంకొందరు నిందితులు కూడా ఉన్నట్టుగా పేర్కొన్నారు.
Also Read: Nizamabad District: బెట్టింగ్ కోరలకు చిక్కిన మరో యువకుడు.. తర్వాత ఏమైందంటే?