Nizamabad District: ఇటీవల కాలంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో మొదలైన ఈ బెట్టింగ్ మోజు చివరకు వేలాది కుటుంబాలను నాశనం చేస్తోంది. వారి ఆశలను అడియాశలుగా మార్చి అప్పుల ఊబిలోకి లాగుతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్ మరో కుటుంబాన్ని కన్నీటి గుదిబండగా మార్చింది. ఆకుల కొండూరు గ్రామానికి చెందిన ఆకాశ్ (23) అనే యువకుడు బెట్టింగ్ బారిన పడి రూ.3 లక్షల మేరకు నష్టపోయాడు. అప్పుల భారం తాళలేక గడ్డిమందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి అతన్ని వెంటనే నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.
Also Read: ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యల్లో కీలక పురోగతి.. పెద్ద సమస్య తీరినట్లే!
పోలీసుల కఠిన చర్యలు
నిజామాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. కొన్ని యాప్స్‌ను బ్లాక్ చేసి, యాప్ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ, కొత్త పేర్లతో ఈ యాప్స్ మళ్లీ మార్కెట్లోకి వస్తుండటంతో యువత మళ్లీ మోసపోతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపైనా ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటున్న సందర్భంలో ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరం.
తల్లిదండ్రుల ఆవేదన
ఇప్పటికే జిల్లాలో బెట్టింగ్ భూతంతో యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎంతో మంది ఈ బెట్టింగ్ మోజులో ప్రాణాలు కోల్పోతున్నారు. సులభమైన సంపద కోసం జీవితం తాకట్టు పెట్టొద్దు అంటూ బాధితుని తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. బెట్టింగ్‌ల జోళికి వెళ్లొద్దని, తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చొద్దని బాధితుని తల్లి వేడుకుంటోంది.