Crime News: కుటుంబ ఆస్తి వివాదాలు ఉన్మాదాలకు (Crime News) దారితీస్తున్నాయి. బంధాలను తెంచి, ఎన్నో హత్యలకు కారణమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా జిల్లాలో తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. సర్ఫాబాద్ అనే గ్రామంలో ఆస్తి విషయంలో జరిగిన గొడవల నేపథ్యంలో 19 ఏళ్ల యువకుడు తన కన్నతండ్రిని ఇటుక రాయితో దారుణంగా కొట్టిచంపాడు. పైగా, రాత్రంతా మృతదేహం పక్కనే భయం బెరుకూ లేకుండా నిద్రపోయాడు. ఈ దారుణానికి సంబంధించిన వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించారు.
మృతుడి పేరు గౌతమ్ (వయస్సు 43) అని, శనివారం రాత్రి అతడు తన గదిలో నిద్రపోతుండగా, కొడుకు ఉదయ్ శబ్దంకాకుండా రూమ్‌లోకి ప్రవేశించి తలపై ఇటుకరాయితో పలుమార్లు కొట్టి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అదే గదిలో రాత్రంతా డెడ్‌బాడీ పక్కన నిద్రపోయాడని పోలీసులు ధృవీకరించారు. హత్య చేశాక నాన్న మృతదేహం పక్కన, అదే గదిలో నిద్రపోయానంటూ నిందితుడు ఒప్పుకున్నాడని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Also- Rajinikanth- Kamal Haasan: ఇద్దరు పెద్ద హీరోలతో ఒక సక్సస్‌ఫుల్ దర్శకుడు.. ఇక బాక్సాఫీస్ బద్దలే
ఆస్తి వివాదాలకు తోడు, మద్యానికి డబ్బులు ఇవ్వబోనంటూ తండ్రి ఖరాఖండీగా చెప్పడమే ఈ ఘర్షణలకు కారణంగా తేలింది. హంతకుడు ఉదయ్ తన మద్యానికి, రోజువారీ ఖర్చులకు తండ్రిపై ఆధారపడేవాడు. తన తండ్రితో తరచూ గొడవలు పెట్టుకునేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడు ఉదయ్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. నిందితుడు ఉదయ్‌ని అరెస్ట్ చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) ప్రకారం కేసు నమోదు చేశామని తెలిపారు. తండ్రిని హత్య చేసేందుకు ఉదయ్ ఉపయోగించిన ఇటుక, నిందితుడి దుస్తులను ఆధారాలుగా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని మరో చోట కూడా ఆస్తి వివాదాల నేపథ్యంలో తండ్రిని హత్య చేసిన ఘటన ఇటీవలే జరిగింది. వారణసీలో ఓ వ్యక్తి ఆస్తి విషయమై తన తండ్రి, అక్కను హత్య చేశాడు. జులై నెలలో ఈ ఘటన జరిగింది. హంతకుడి పేరు రాజేష్ కుమార్, కాగా, అతడి తండ్రి రూప్ చంద్ర భరద్వాజ్ ( 78), అక్క శివకుమారి (50) చనిపోయారు. ఈ హత్య కోసం మెటల్ రాడ్, నిర్మాణంలో ఉపయోగించే బండలను వాడినట్టు పోలీసులు తేల్చారు. కుటుంబ ఆస్తి విషయంలో జరిగిన తీవ్ర వాగ్వాదం తర్వాత నిందితుడు తండ్రిని, అక్కను పదేపదే భౌతికదాడి చేశాడు. ఇరుగుపొరుగు వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులు రాజేష్, అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. సమాజంలో ఈ తరహా ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆస్తి కోసం కుటుంబ సంబంధాలను సైతం మట్టుపెడుతుండడం చర్చనీయాంశంగా మారింది.