Shocking Murder( image credit: twitter)
క్రైమ్

Shocking Murder: వృద్ద దంపతుల.. దారుణ హత్య!

Shocking Murder: రాజేంద్రనగర్ బుద్వేల్ లో దారుణం జరిగింది. ఫిజియోథెరపీ చేయటానికి వచ్చామంటూ ఇంట్లోకి ప్రవేశించిన అగంతకులు వృద్ధ దంపతులను కత్తులతో పొడిచి కిరాతకంగా హతమార్చారు. తెలిసినవారే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను పట్టుకునేందుకు అయిదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్​ తెలిపారు.

సంఘటనా స్థలానికి వచ్చిన ఆయన త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో రెడ్​ హిల్స్​ ప్రాంతంలో నివాసమున్న రిజ్వానా (65), షేక్ అబ్దుల్లా (70) భార్యాభర్తలు. షేక్​ అబ్దుల్లా స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలో పని చేసి రిటైరవగా రిజ్వానా ఓ ప్రైవేట్​ కాలేజీలో లెక్చరర్​ గా పని చేసి పదవీ విరమణ పొందారు. వీరికి నలుగురు సంతానం. ఇద్దరు అమెరికాలో స్థిరపడగా ఇద్దరు లండన్​ లో ఉంటున్నారు.

Also ReadGold Medal Electrical: రాజస్థాన్ నకిలీ వ్యాపారాలతో.. ఆర్థికంగా నష్టపోతున్న ప్రజలు!

నలభై రోజుల క్రితమే…
ఇదెలా ఉండగా బుద్వేల్​ ప్రాంతంలోని జనచైతన్య వెంచర్​ సమీపంలో షేక్ అబ్దుల్లా దంపతులు కొన్నేళ్ళ క్రితం ఓ ప్లాట్ కొన్నారు. దాంట్లో అబ్రీజ్ రెసిడెన్సీ పేరుతో అయిదంతస్తుల భవనాన్ని కట్టించారు. డూప్లెక్స్ లా కట్టించుకున్న అయిదో అంతస్తులో ఉంటున్నారు. నలభై రోజుల క్రితమే భార్యాభర్తలు ఈ ఇంట్లోకి వచ్చారు.

గురువారం సాయంత్రం…
ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం 5గంటల సమయంలో ఇద్దరు షేక్ అబ్దుల్లా ఇంటికి వచ్చారు. వీరిలో ఒకరు బురఖా ధరించి ఉండగా రెండో వ్యక్తి తాము ఫిజియో థెరపీ చేయటానికి వచ్చామని వాచ్ మెన్​ తో చెప్పాడు. దాంతో వాచ్ మెన్​ పైకి ఫోన్ చేసి షేక్ అబ్దుల్లాతో మాట్లాడాడు. వచ్చిన వారిని పైకి పంపించమని చెప్పటంతో వాచ్​ మెన్​ ఇద్దరిని లోపలికి అనుమతించాడు. అయిదో అంతస్తుకు వెళ్లిన వీరిలో ఒకరు పది నిమిషాల తరువాత కిందకు వచ్చి వెళ్లిపోగా రెండో వ్యక్తి దాదాపు 45 నిమిషాల సమయం తరువాత బయటకు వచ్చాడు.

శుక్రవారం నిద్ర లేవక పోవటంతో…
మామూలుగా షేక్ అబ్దుల్లా దంపతులు ప్రతిరోజు ఉదయం 6గంటలకే నిద్ర లేస్తారు. శుక్రవారం ఉదయం 9గంటలు దాటినా మేల్కొనక పోవటంతో అనుమానం వచ్చిన వాచ్ మెన్​ అయిదో అంతస్తుకు వెళ్లాడు. చూడగా షేక్​ అబ్దుల్లా, రిజ్వానాలు రక్తం మడుగులో చనిపోయి కనిపించారు. వెంటనే స్థానికుల సహాయంతో వాచ్​ మెన్​ రాజేంద్రనగర్​ పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలియగానే హత్యా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్​ స్క్వాడ్​ ను రప్పించారు.

 Also Read: Hyderabad: భవిష్యత్తులో హైదరాబాద్‌లో బతకలేమా?

9 కత్తిపోట్లు…
పోలీసులు జరిపిన విచారణలో దుండగులు షేక్​ అబ్దుల్లాను కత్తితో తొమ్మిదిసార్లు పొడిచి హత్య చేసినట్టుగా నిర్ధారణ అయ్యింది. రిజ్వానాను ఛాతీలో పొడిచి చంపినట్టుగా తెలిసింది. సంఘటనా స్థలం నుంచి పోలీసులు హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్యలు చేయటానికే దుండగులు ఆ కత్తిని కొని తెచ్చినట్టుగా అక్కడే దొరికిన దాని కవర్​ ను బట్టి స్పష్టమైంది.

తెలిసినవారి ఘాతుకమే….?
కాగా, షేక్​ అబ్దుల్లా దంపతుల గురించి పూర్తిగా తెలిసినవారే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు వృద్ధులు కావటంతో కాళ్లనొప్పుల సమస్యలతో బాధపడుతున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఉపశమనం కోసం భార్యాభర్తలు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నట్టుగా తెలిసింది. ఈ విషయం తెలిసే దుండగులు ఫిజియోథెరపీ చేసేవారిలా వారి ఇంటికి వచ్చినట్టుగా భావిస్తున్నారు.

దోపిడీ కోసమేనా…?
ఇక, దోపిడీ కోసమే దుండగులు దంపతులిద్దరిని హత్య చేసినట్టుగా భావిస్తున్నారు. ఇటీవల కొత్తగా భవనం కట్టించిన నేపథ్యంలో ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉండి ఉండవచ్చని దుండగులు భావించి ఉండవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిజియోథెరపీ చేయటానికి వచ్చినట్టుగా ఇంట్లోకి ప్రవేశించి భార్యాభర్తలను హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు. ఆ తరువాత ఇంట్లోని బీరువాలు తెరిచి వాటిల్లో ఉన్న డాక్యుమెంట్లు, ఇతర వస్తువులను ఇల్లంతా చెల్లాచెదురుగా విసిరేశారు. కాగా, సంఘటనా స్థలానికి వచ్చిన రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్​ మాట్లాడుతూ సొత్తును దోచుకోవటానికి వచ్చి ఈ ఘాతుకానికి ఒడిగట్టారా? లేక విలువైన ఆస్తి డాక్యుమెంట్ల కోసం హత్యలు చేశారా? అన్నది నిర్ధారణ కావాల్సి ఉందన్నారు. హత్యలు జరిగిన అబ్రీజ్ రెసిడెన్సీలోని సీసీ కెమెరాల ఫుటేజీని ఇప్పటికే విశ్లేషించినట్టు చెప్పారు.

దేహ దారుఢ్యాన్ని బట్టి చూస్తే బురఖాలో వచ్చింది కూడా మగ వ్యక్తే అయి ఉంటాడని తెలిపారు. ఇక, షేక్ అబ్దుల్లా ఇంటి పరిసరాల్లోని మరో వందకు పైగా సీసీ కెమెరాల ఫుటేజీని కూడా పోలీసులు సేకరించినట్టుగా తెలిసింది. దీని ఆధారంగా దుండగులు ఏ దారిలో వచ్చారు? ఏ దారిలో వెళ్లారు? అన్నది నిర్దారిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కీలక ఆధారాలు పోలీసుల చేతికి చిక్కినట్టుగా తెలిసింది. డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ నిందితులను పట్టుకునేందుకు అయిదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు చెప్పారు. త్వరలోనే ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను పట్టుకుంటామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

పోలీసుల అదుపులో…
ఇదిలా ఉండగా ప్రస్తుతం రాజేంద్రనగర్​ పోలీసులు షేక్​ అబ్దుల్లా వద్ద పని చేస్తున్న వాచ్ మెన్, కారు డ్రైవర్​ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలిసింది. షేక్​ అబ్డుల్లా దంపతులు ఫిజియోథెరపీ చేయించుకుంటున్న విషయం ఈ ఇద్దరికి తెలుసు కాబట్టి వీళ్లేమైనా కుట్ర చేసి తమ స్నేహితులను ఇంటికి పిలిపించారా? అన్న కోణంలో ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. కానిపక్షంలో నిజంగానే ఎవరైనా ఫిజియోథెరపీ చేయటానికి వస్తున్నారా?…ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు?…వాళ్లు ఎవరు? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

వీళ్లు గురువారం సాయంత్రం తమ స్థానంలో సహచరులను పంపించారా? అన్న దిశగా కూడా విచారణ చేస్తున్నారు. రోజు వస్తున్న వారైతే వాచ్​ మెన్ వారిని కింద ఆపి లోపలికి పంపించాలా? వద్దా? అని షేక్​ అబ్దుల్లా దంపతులను అడిగేవాడు కాదని ఓ అధికారి చెప్పటం గమనార్హం. ఇక, వాచ్​ మెన్ ద్వారా బురఖా లేకుండా వచ్చిన దుండగుడి స్కెచ్​ ను కూడా తయారు చేస్తున్నట్టుగా తెలిసింది.

 Also Read: Hydraa: నాలా ఆక్రమణలపై.. హైడ్రా యాక్షన్ షురూ!

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు