Pregnancy Job: నానాటికి పెరిగిపోతున్న సాంకేతికతను ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మనుషుల బలహీనతలను ఆసరాగా చేసుకొని లక్షల్లో కొల్లగొడుతున్నారు. తాజాగా మహారాష్ట్ర పుణెలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. గర్భవతిని చేస్తే రూ.25 లక్షలు ఇస్తామన్న ప్రకటనను నమ్మి ఓ కాంట్రాక్టర్ ఏకంగా రూ.11 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ విషయాలను పోలీసులు వెల్లడించగా ప్రస్తుతం అవి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే?
పుణెలోని బనేర్ పోలీసు స్టేషన్ (Baner Police Station) లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఈ మోసపూరిత ఘటన సెప్టెంబర్ మెుదటి వారంలో జరిగింది. బాధితుడైన 44 ఏళ్ల కాంట్రాక్టర్.. సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర ప్రకటనను చూశాడు. అందులో ఒక యువతి హిందీలో మాట్లాడుతూ ‘నాకు తల్లి కావాలని ఉంది. దానికి సహాయం చేసిన వ్యక్తికి రూ.25 లక్షలు ఇస్తాను. సాయం చేసే వ్యక్తి విద్యార్హత, కులం, రూపంతో నాకు ఎలాంటి పట్టింపు లేదు’ అని చెప్పుకొచ్చింది. ఈ ప్రకటనపై ఆసక్తి కనబరిచిన బాధితుడు.. వీడియోలో చూపించిన నెంబర్ కు కాల్ చేశాడు.
100కు పైగా ఆర్థిక లావాదేవీలు
బాధితుడి ఫోన్ కాల్ ను రిసీవ్ చేసుకున్న ఓ వ్యక్తి.. తనను తాను ‘ప్రెగ్నెంట్ జాబ్’ అనే సంస్థ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. ఉద్యోగానికి ఎంపిక కావాలంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని నమ్మించాడు. రిజిస్ట్రేషన్, ఐడీ కార్డు, వెరిఫికేషన్, జీఎస్టీ, టీడీఎస్ వర్క్స్ అని చెప్పి పలుమార్లు బాధితుడి నుంచి డబ్బును తీసుకున్నాడు. అయితే ప్రతీసారి చిన్న మెుత్తంలోనే అడుగుతుండటంతో బాధితుడికి పెద్దగా అనుమానం రాలేదు. అలా సెప్టెంబర్ ప్రారంభం నుంచి అక్టోబర్ 23 వరకూ బాధితుడి యూపీఐ, బ్యాంక్ ఐఎంపీఎస్ ద్వారా 100 కంటే ఎక్కువ ఆర్థిక లావాదేవీలు జరిపించుకున్నాడు. తద్వారా రూ.11 లక్షల వరకూ బాధితుడి నుంచి వసూలు చేశాడు.
Also Read: IND vs AUS 2nd T20I: అభిషేక్ ఒంటరి పోరాటం.. చేతులెత్తేసిన మిగతా బ్యాటర్లు.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?
రంగంలోకి సైబర్ పోలీసులు..
రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బులు వసూలు చేసి.. కాలం గడుపుతుండటంతో బాధితుడికి అనుమానం వచ్చింది. తనతో ఫోన్ లో మాట్లాడుతున్న వ్యక్తిని బాధితుడు నిలదీశాడు. దీంతో కేటుగాళ్లు బాధితుడి నెంబర్ ను బ్లాక్ చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు.. వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు అధికారి ఈ కేసుపై స్పందిస్తూ.. మోసగాళ్లు బాధితుడి వీక్ నెస్ ను క్యాష్ చేసుకున్నారు. కట్టు కథలు చెప్పి పలుమార్లు డబ్బులు అడిగారు. నిందితుల ఫోన్ నెంబర్లు, బ్యాంక్ ఖాతాలను ట్రేస్ చేసే పనిలో ఉన్నాం. బాధితుడికి త్వరలోనే న్యాయం చేస్తాం’ అని పేర్కొన్నారు.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				