Palnadu district Shocking: ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనను దూరం పెట్టిందనే కోపంతో ప్రియురాలి ముక్కును ఓ వ్యక్తి కోడికత్తితో దారుణంగా కోసేశాడు. అంతటితో ఆగకుండా తెగిన ముక్కు పట్టుకొని.. ఘటనాస్థలి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని.. స్థానికులు హుటాహుటీనా అస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు అత్యవసర వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే..
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం లెనిన్ కాలానికి చెందిన మరియమ్మ భర్తకు దూరంగా ఉంటోంది. స్థానిక ఇనుప సామాగ్రి దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. కొద్ది కాలం క్రితం ఆమెకు బ్రహ్మానందరెడ్డి కాలనీకి చెందిన కంపా వెంకట్రావు (అతడు కూడా భార్యకు దూరంగా ఉంటున్నాడు)తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడంతో వీరిద్దరు తరుచూ ఇంట్లో కలుస్తుండేవారు.
దూరం పెట్టడంతో..
కొద్ది రోజుల క్రితం మరియమ్మ, వెంకట్రావుల మధ్య ఓ విషయంలో గొడవ జరిగింది. దీంతో మనస్పర్థలు తలెత్తి వెంకట్రావును మరియమ్మ దూరం పెట్టింది. దీంతో మరియమ్మను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె ససేమీరా అంటూ వచ్చింది. దీంతో మరియమ్మపై వెంకట్రావు అనుమానం పెంచుకున్నాడు. ఆమె జీవితంలోకి మరో వ్యక్తి రావడం వల్లే తనను దూరం పెడుతోందని భావించి కక్షగట్టాడు. దీంతో మరియమ్మకు ఎలాగైన బుద్ది చెప్పాలని భావించాడు.
Also Read: TPCC Chief: యావత్ ఫ్యామిలీ.. అలీ బాబా దొంగల బ్యాచ్.. కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ చురకలు
నిద్రిస్తున్న సమయంలో..
మరియమ్మ నిద్రిస్తున్న సమయంలో నెమ్మదిగా ఇంట్లోకి చొరబొడ్డ వెంకట్రావు.. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె ముక్కును ఒక్కసారిగా కోసేశాడు. అనంతరం తనతో ముక్కును తీసుకెళ్లిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో మరియమ్మ కేకలు వేయగా.. స్థానికులు అప్రమత్తమై ఆమె వద్దకు పరిగెత్తుకొచ్చారు. ఆమెను హుటాహుటీనా నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మరియమ్మ పరిస్థితి సీరియస్ గా ఉండటంతో అక్కడి వైద్యులు గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. మరియమ్మకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. నిందితుడు వెంకట్రావు.. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో తాత్కాలిక వర్కర్ గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

