TPCC Chief: ఫోన్ ట్యాపింగ్ తప్పేం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ టెలిగ్రాఫ్ చట్టం గురించి చదవాలని హితవు పలికారు. ఫోన్ ట్యాపింగ్ సీరియస్ నేరమన్న టీపీసీసీ చీఫ్.. ఒకరి సంభాషణ మరొకరు వినడం దౌర్భాగ్యమని అన్నారు. లొంగదీసుకోవడం కోసం.. వాటల కోసం ట్యాపింగ్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. సొంత మనుషులు హంపీలో దావత్ చేసుకుంటే ట్యాప్ చేసి సమాచారం సేకరించారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
బీఆర్ఎస్ నాయకులు స్టువర్టు పురం దొంగలతో సమానమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. యావత్ ఫ్యామిలీ అలీ బాబా 40 మంది దొంగల బ్యాచ్ అంటూ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వంలో ట్యాపింగ్ అనే పరిస్థితే లేదని.. టెర్రరిస్టుల ముప్పు ఉంటే కేంద్రం అనుమతి తీసుకునే ట్యాపింగ్ చేస్తామని స్పష్టం చేశారు. అటు రూ.కోట్లు విలువ చేసే భూములను క్విట్ ప్రోకో ద్వారా బీఆర్ఎస్ నేతలు దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి ప్రజా క్షేత్రంలో ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. మరోవైపు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణిలో జరిగిన అవకతవకలపై పీఏసీలో చర్చిస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
Also Read: Google Pixel Bug: గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. మీ మాటలు సీక్రెట్‌గా వింటున్నారు!
మరోవైపు కవిత గురించి ప్రస్తావిస్తూ.. ఆస్తుల అంశమే కేసీఆర్ ఫ్యామిలీలో గొడవలకు మూలమని టీపీసీసీ చీఫ్ అన్నారు. కవిత కాంగ్రెస్ లోకి వస్తా అంటే ముందు నుంచి వద్దనే చెబుతున్నామని పేర్కొన్నారు. తమ పార్టీకి కవిత అవసరం లేదన్న మహేశ్ కుమార్ రెడ్డి.. ప్రభావవంతమైన లీడర్లకు తమ పార్టీలో కొదవలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై సిట్ విచారణ మరింత లోతుగా జరగాల్సిన అవసరముందన్న ఆయన.. 500 పైగా ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించారు. చివరికి తన క్లాస్ మేట్ శైలెందర్ రెడ్డి ఫోన్ ను సైతం ట్యాప్ చేశారని ఆయన కూడా సిట్ ముందు హాజరయ్యారని పేర్కొన్నారు.

