Honeymoon Case: హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లి, అక్కడ భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi ) చేతిలో దారుణాతి దారుణ హత్యకు గురైన రాజా రఘువంశీ (Sonam Raghuvanshi) విషాదకర ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తులో భాగంగా ఈ కేసుకు సంబంధించిన సంచలన వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తన భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు భార్య సోనమ్ తొలుత కిరాయి హంతకులకు రూ.4 లక్షల సుపారి ఇస్తానని ఆఫర్ చేసింది. ఈ మేరకు డీల్ కుదిరింది. కానీ, ఆ తర్వాత పరిస్థితిని బట్టి ఆ మొత్తాన్ని ఏకంగా రూ.20 లక్షలకు పెంచిందని పోలీసు వర్గాల ద్వారా బయటపడింది.
బెంగళూరులోనే కలిశారు
సోనమ్ నియమించుకున్న కిరాయి హంతకులు తొలుత బెంగళూరు నగరంలోనే నూతన దంపతులను కలిశారు. అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్‌లో మేఘాలయకు వెళ్లారు. బాధితుడు రాజా, నిందిత వ్యక్తులు ఇండోర్‌కు చెందినవారు కావడంతో ఫ్లైట్‌లో మాట్లాడుకున్నారని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. సోనమ్ ప్రియుడు కుష్వాహా వారితో పాటు మేఘాలయ వెళ్లకపోయినా, తెరవెనుక ప్రణాళిక, కుట్ర మొత్తం అతడే చేశాడని షిల్లాంగ్ పోలీసు వర్గాలు తెలిపాయి. సోనమ్‌తో అతడు టచ్‌లో ఉన్నాడని వివరించారు.
Read this- Strawberry Moon: రేపే స్ట్రాబెర్రీ మూన్.. ఆకాశంలో ఏం జరగబోతోంది?
ఎక్కడికి వెళ్లినా అనుసరించారు
ఇండోర్ నగరంలో మే 11న రాజా, సోనమ్‌ల వివాహం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ప్రియుడు రాజ్ కుష్వాహాను సోనమ్ కలిసింది. అప్పుడే ఇద్దరూ కలిసి హత్యకు ప్లాన్ చేసినట్టు తేలింది. ప్లాన్‌లో భాగంగానే హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లడానికి మాత్రమే సోనమ్ బుకింగ్ చేసింది. తిరుగు ప్రయాణానికి మాత్రం బుక్ చేయలేదని దర్యాప్తులో తేలింది. పథకం ప్రకారం, నిందితులు మే 21న గౌహతిలో దంపతులను ఫాలో అయ్యారు. వారు బస చేసిన హోటల్ దగ్గరే బస చేసి, మే 22న షిల్లాంగ్‌కు వెళ్లారు. మే 23న సోనమ్, రాజా రఘువంశీ జలపాతాన్ని వీక్షించేందుకు నిటారుగా ఉన్న ఒక కొండను ట్రెక్కింగ్ చేసేందుకు వెళ్లారు. హంతకులు కూడా వారిని అనుసరించారు.
Read this- Honeymoon Murder Case: హనీమూన్ మర్డర్ కేసులో ఇంత జరిగిందా? ప్రేమ, ద్రోహం, క్రోదం ఎన్ని కోణాలో!
అలసిపోయినట్టు నటించిన సోనమ్
భర్త హత్యకు కుట్ర పన్నిన సోనమ్ ఒకానొక సమయంలో అలసిపోయినట్లు నటించింది. తన భర్త, హంతకుల కంటే వెనుక చాలా దూరంలో నడవడం మొదలుపెట్టింది. వెనకే నడుస్తూ ఎవరూ లేని ప్రదేశానికి వచ్చామని నిర్ధారించుకున్న తర్వాత, తన భర్తను చంపేయాలంటూ హంతకులను ఆమె కోరినట్టు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, సోనమ్ చెప్పిన వెంటనే హత్య చేసేందుకు హంతకులు ఒప్పుకోలేదు. అలసిపోయామని చెప్పి హత్యకు నిరాకరించారు. దీంతో, ఎక్కడ ఛాన్స్ మిస్ అవుతుందేమోనని ఆందోళన చెందిన సోనమ్ సుపారీని ఏకంగా రూ.20 లక్షలకు పెంచింది. రాజా మృతదేహాన్ని భారీ లోయలో పడవేయడంలో హంతకులకు సోనమ్ కూడా సాయం చేసిందని తేలింది. రాజా రఘువంశీ తలపై రెండుసార్లు బలంగా కొట్టినట్టు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. తల ముందు భాగంలో ఒకసారి, వెనుక భాగంలో ఒకసారి చాలా బలంగా కొట్టారు. జూన్ 3న రాజా మృతదేహం లభ్యమైన రోజే భార్య సోనమ్ పాత్ర ఉన్నట్టు మేఘాలయ పోలీసులకు అర్థమైపోయింది.