Meerpet Murder Case: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మీర్‌పేట్ భార్య హత్య కేసులో (Meerpet Murder Case) వేగవంతమైన న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. రంగారెడ్డి జిల్లా కోర్టుల సముదాయంలో ఈ కోర్టును ఏర్పాటు చేశారు. ఈ నెల 17 నుంచి కేసు విచారణలో రోజువారీ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయని, రెండు నెలల్లోనే తీర్పు వెలువడనుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లాకు చెందిన గురుమూర్తి ఆర్మీలో నాయక్ సుబేదార్‌గా పనిచేసి రిటైరై, హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. పదమూడేళ్ల క్రితం మాధవితో వివాహం జరిగింది. అయితే, కొంతకాలంగా గురుమూర్తి సమీప బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. తన సంతోషానికి అడ్డు వస్తున్న మాధవిని హత్య చేయాలని గురుమూర్తి నిర్ణయించుకున్నాడు.
Also Read: Meerpet Murder Case: మీర్ పేట్ మాధవి హత్య కేసులో బిగ్ ట్విస్టు.. డీఎన్ఏ రిపోర్టులో సంచలన నిజాలు
వెబ్ సిరీస్ చూసి
ఓటీటీలో ఓ వెబ్ సిరీస్‌ను చూసి హత్య ఎలా చేయాలి?, మృతదేహాన్ని ఎలా మాయం చేయాలి? అనే విషయాలు తెలుసుకున్న గురుమూర్తి, అచ్చం అలాగే అమలు చేయాలని కుట్ర పన్నాడు. సంక్రాంతి సమయంలో భార్య, పిల్లలతో కలిసి సోదరి ఇంటికి వెళ్లి, పిల్లలను అక్కడే వదిలేసి భార్యతో తన నివాసానికి చేరుకున్నాడు. జనవరి 15న మరోసారి గొడవ జరగడంతో, మాధవిని దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం గురుమూర్తి ముందుగా కొని పెట్టుకున్న కత్తితో మాధవి మృతదేహాన్ని బాత్రూంలో ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత వాటర్ హీటర్ వేసి శరీర భాగాలను ఉడకబెట్టాడు. మాంసాన్ని వేరు చేసి, రోకలితో దంచి ముద్దగా మార్చాడు. ఎముకలను కూడా పిండి పిండి చేసి సంచుల్లో నింపి, ఇంటికి కొద్ది దూరంలో ఉన్న పెద్ద చెరువులో విసిరేశాడు.
వెలుగులోకి ఇలా
మాధవి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులకు గురుమూర్తి ఫోన్ చేయడంతో వారు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా, గురుమూర్తి ఇంటి బయట ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని విశ్లేషించగా, మాధవి లోపలికి వెళ్లిన దృశ్యాలు మాత్రమే కనిపించాయి. అనుమానంతో పోలీసులు గురుమూర్తిని విచారించగా, నేరం అంగీకరించాడు. ఇంటి నుంచి క్లూస్ టీం సేకరించిన ఎండిన రక్తపు చుక్కలు మాధవి పిల్లల డీఎన్ఏతో సరిపోలడంతో నేరం నిర్ధారణ అయ్యింది. పటిష్టమైన సైంటిఫిక్ ఆధారాలను సమర్పించిన నేపథ్యంలో కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించారు.
Also Read: Crime News: సైదాబాద్‌లో బాలుడిపై లైంగిక దాడి.. చెబితే చంపుతా అంటూ బెదిరింపులు
