Crime News: పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకురావాల్సిన జువెనైల్ హోమ్‌లో ఉద్యోగే కీచకపర్వానికి పాల్పడ్డాడు. సైదాబాద్‌లోని బాలుర సదనంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న రెహమాన్(Rahman) అనే ఉద్యోగి, ఓ తొమ్మిదేళ్ల బాలుడిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించడంతో ఆ బాలుడు ఆరు నెలలుగా ఈ కిరాతకాన్ని భరించాల్సి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన భార్యాభర్తలు తమ తొమ్మిదేళ్ల కొడుకు చెడు సావాసాలకు అలవాటు పడటంతో, పరిచయం ఉన్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వర్కర్ శిరీష సూచన మేరకు 2024లో సైదాబాద్ బాలుర సదనంలో చేర్చారు. మార్చి నెల నుంచి సూపర్‌వైజర్ తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, బయట చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధితుడు వెల్లడించాడు.
దసరా పండుగ సందర్భంగా..
ఇటీవల దసరా పండుగ సందర్భంగా బాలుడిని ఇంటికి తీసుకెళ్లిన తల్లి, సెలవుల తర్వాత తిరిగి సదనానికి తీసుకురావడానికి ప్రయత్నించగా బాలుడు తీవ్రంగా అంగీకరించలేదు. బలవంతం చేయగా, బాలుర సదనం రెహమాన్ చేస్తున్న లైంగిక దాడి గురించి భోరున విలపిస్తూ తల్లికి తెలిపాడు. సదనంలోని గణేశ్, డేనియల్, జగదీష్ అనే పిల్లలకు కూడా ఈ విషయం తెలుసని, కొందరి సమక్షంలోనే రెహమాన్ తనపై దాడి చేశాడని చెప్పాడు.
Also Read: Maoist Posters: వడ్డీ వ్యాపారులారా ఖబర్దార్?.. భద్రాచలంలో మావోల పోస్టర్లు కలకలం
పోలీసుల అదుపులో నిందితుడు..
బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు వెంటనే స్పందించారు. నిందితుడైన రెహమాన్‌పై బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 126(2), పోక్సో యాక్ట్ సెక్షన్ 5(డీ)(1)(ఎం) రెడ్ విత్ 6, జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ సెక్షన్ 3(2)(వీఏ) ప్రకారం కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం రెహమాన్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. ఈ దారుణాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తీవ్రంగా పరిగణించింది. నింబోలిఅడ్డ బాలికల సదనం సూపరింటెండెంట్ మైథిలీని విచారణాధికారిగా నియమిస్తూ, సమగ్ర నివేదికను అందచేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై విచారణ జరిపిన మైథిలీ, బాలుడిపై లైంగిక దాడి జరిగిన విషయం నిజమేనని తమ విచారణలో నిర్ధారణ అయినట్టు తెలిపారు. నిందితునిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు.
Also Read: Cyber Criminals: కేటుగాళ్ల భరతం పడుతున్న పోలీసులు.. 59 మంది అరెస్ట్.. ఎన్ని లక్షలు రికవరీ చేసారంటే?
