Maoist Posters: వడ్డీ రూపంలో ప్రజలకు డబ్బులు ఇచ్చి ప్రజల రక్తాన్ని పిండుతున్నారు
వడ్డీ వ్యాపారులకు ఇదే మా హెచ్చరిక
భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి లచ్చన్న పేరుతో లేఖ
భద్రాచలం, స్వేచ్ఛ: మావోయిస్టుల లేఖల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా శనివారం విడుదల చేసిన ఒక లేఖ కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లేఖలోని సారాంశం… వడ్డీ వ్యాపారులారా ఖబర్దార్! అంటూ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి లచ్చన్న హెచ్చరిస్తున్నట్టుగా పేర్కొన్నారు.
Read Also- Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం ఆ ఇద్దరు పండిట్స్! థమన్ స్కెచ్ అదిరింది
లేఖలో ఏముందంటే?
‘‘ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని వడ్డీ రూపంలో డబ్బులు ఇస్తూ ప్రజల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తూ రక్తాన్ని పిండుతున్న వడ్డీ వ్యాపారులకు ఇదే మా హెచ్చరిక’’ అని పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారులు ప్రజలపై భారీ ఆర్థిక భారం మోపి అక్రమంగా సంపాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వడ్డీ వ్యాపారులు తమ పద్ధతి మార్చుకోవాలని, వడ్డీ వ్యాపారులు చేస్తున్న దౌర్జన్యానికి ప్రజలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారని వివరించారు. మరి కొంతమంది ఆస్తులు అమ్ముకొని రోడ్డు మీద పడుతున్నారన్నారు. వడ్డీ వ్యాపారులు చేసే వ్యాపారంతో ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. వడ్డీలకు తీసుకున్న వాళ్లు రోడ్డు పాలవుతూ నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.
వడ్డీ వ్యాపారులారా మీరు పద్ధతి మార్చుకోకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు హెచ్చరించారు. ప్రజలు ఇప్పటివరకు తీసుకున్న అధిక వడ్డీల డబ్బులు తీర్చాల్సిన అవసరం లేదని సూచనలు చేశారు. వడ్డీ వ్యాపారులు ఎవరైనా వడ్డీకి తీసుకున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తే తమకు తెలియజేయాలని అన్నారు. వెంకటాపురం, అలుబాక, ఏదిర, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం వరకు వడ్డీ వ్యాపారస్తులకు ఎవరు డబ్బులు తిరిగి కట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారస్తులకు భయపడి ప్రాణాలు కోల్పోవద్దని హామీ ఇచ్చారు. వడ్డీ వ్యాపారులు బెదిరించి డబ్బులు కట్టించాలని చూస్తే సమాచారం ఇవ్వాలని లేఖలో కోరారు.
