MLC Kavitha
క్రైమ్

Delhi Liquor Case: వచ్చే నెలలో తేలనున్న కవిత భవితవ్యం

– కవిత విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠ
– ఈడీ కేసులో ముగిసిన వాదనలు
– మే 6 వరకు తీర్పు రిజర్వ్
– సీబీఐ కేసులో మే 2న తీర్పు
– కస్టడీ మే 7 వరకు పొడిగింపు
– ఎన్నికలకు వారం ముందు ఏం జరగనుంది?

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కవిత, రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్‌పై మూడు రోజులపాటు వాదనలు కొనసాగాయి. బుధవారం కవిత తరఫు వాదనలు విన్న న్యాయస్థానం, తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. మే 6వ తేదీన వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఈడీ వాదనలపై రెండు రోజుల్లో లిఖితపూర్వక రిజాయిండర్ ఇస్తామని కవిత తరఫు న్యాయవాది నితీశ్ రాణా తెలిపారు. సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్‌పై కోర్టు మే 2వ తేదీకి తీర్పు రిజర్వ్ చేసింది. ఈడీ కేసులో బెయిల్‌పై తీర్పు 6వ తేదీకి రిజర్వ్ చేసింది. అయితే, కవిత కస్టడీని మే 7వ తేదీ వరకు పొడిగించింది. ఈ రెండు కేసుల్లో బెయిల్ లభిస్తే, మే నెలలో కవిత జైలు నుంచి బయటకు రావొచ్చు. ఒక వేళ రెండింటిలో ఏ ఒక్క కేసులో బెయిల్ రాకున్నా కస్టడీ కొనసాగే అవకాశం ఉన్నది.

కస్టడీ పొడిగింపుకే ఛాన్స్

జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మళ్లీ పొడిగించే అవకాశాలు లేకపోలేదు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో క్విడ్ ప్రోకో జరిగిందని ఈడీ ఆరోపించింది. పాలసీ అనుకూలంగా రూపొందించడానికి లంచాలు ఇచ్చారని పేర్కొంది. లైసెన్స్, మార్జిన్ ఫీజు పెంచడంలో ఎలాంటి విధానం లేదని, కొత్త మద్యం పాలసీలో 5 నుంచి 12 శాతానికి పెంచారని, పెంచిన లాభాన్ని వెనక్కి పొందేలా డీల్ చేసుకున్నారని ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్ తెలిపారు. కేజ్రీవాల్, సౌత్ గ్రూప్‌ల మధ్య విజయ నాయర్ మధ్యవర్తిగా వ్యవహరించారని, లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఇండో స్పిరిట్ చాలా కీలకంగా ఉన్నదని వివరించారు. లిక్కర్ బిజినెస్ కోసమే ఢిల్లీ సెక్రెటేరియట్‌లో కేజ్రీవాల్‌ను మాగుంట శ్రీనివాసులు కలిశారని ఆరోపించారు. కేజ్రీవాల్ సూచన మేరకే ఆయన కవితను కలిశారని పేర్కొన్నారు.

Also Read: ప్రధాని మోదీకి ఎన్నికల కోడ్ వర్తించదా..?

వంద కోట్ల ముడుపుల చుట్టూనే అంతా!

ఆప్‌కు రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారని, కవిత ఆదేశాల మేరకు అవి ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ చేరవేసిందని హుస్సేన్ కోర్టుకు తెలిపారు. బుచ్చిబాబు, మాగుంట రాఘవ వాట్సాప్ చాట్‌లో సాక్ష్యాధారాలు దొరికాయని, రాఘవ అప్రూవర్‌గా మారి ధ్రువీకరించారని వివరించారు. కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్లుగా మారారని, వారిని అనుమానించడమంటే కోర్టును అనుమానించడమే అని వాదించారు. ఇందులో ఎలక్టోరల్ బాండ్ల ప్రస్తావన అనవసరం అని చెప్పారు. కవిత, ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య డీల్ ఉందని బుచ్చిబాబు స్టేట్‌మెంట్ ఇచ్చారని పేర్కొన్నారు. ఫోన్లు ఇవ్వాలని అడిగిన నాలుగు గంటల తర్వాత ఆమె ఫార్మాట్ చేశారని, మార్చి 14, 15 తేదీల్లో పది ఫోన్లను ఫార్మాట్ చేశారని వివరించారు. కవిత తన ఫోన్లలోని డేటాను ఎందుకు డిలీట్ చేశారని అడిగితే సమాధానం ఇవ్వలేదని తెలిపారు.

Also Read: ‘కేసీఆర్ మైండ్‌గేమ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు బలి!’

వాడీవీడిగా వాదనలు

కవితకు వ్యతిరేకంగా ఏ ఆధారాలూ లేవని, పలుమార్లు తమ వాంగ్మూలాలు మార్చిన నిందితుల స్టేట్‌మెంట్ల ఆధారంగా అరెస్టు చేశారని ఆమె తరఫు న్యాయవాదులు ఇది వరకే వాదించారు. ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అరెస్టు సమయంలోనూ ఈడీ నిబంధనలను పాటించలేదని, సూర్యాస్తమయం తర్వాత ఆమెను అరెస్టు చేశారని అన్నారు. ట్రాన్సిట్ వారెంట్ ఆర్డర్ లేదని తెలిపారు. బెయిల్‌పై ఉన్నా కేసు విచారణకు ఆమె సహకరిస్తారని హామీ ఇచ్చారు. కానీ, ఈడీ తరఫు న్యాయవాదులు మాత్రం కవిత బెయిల్‌ను వ్యతిరేకించారు. ఆమెకు బెయిల్ ఇస్తే కేసు పురోగతిని ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నదని ఈడీ న్యాయవాది వాదించారు. కవితను అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. కవితను సూర్యాస్తమయానికి ముందే అరెస్టు చేశామని, 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని వివరించారు. ఇండో స్పిరిట్‌లో కవితకు 32.5 శాతం వాటా ఉన్నదని పేర్కొన్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు