– ఎన్నికల నిబంధనలు పట్టించుకోని మోదీ
– ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు
– ప్రచారంలో విద్వేషపూరిత ప్రసంగాలు
– గతేడాది అసెంబ్లీ ఎన్నికల టైమ్ లోనూ ఇంతే
– పదేళ్లు పాలించి అభివృద్ధిపై మాటల తక్కువ
– కాంగ్రెస్ ని తిట్టడం ఎక్కువ
– ఎన్నికల టైమ్ లోనే డీడీ లోగో మార్చాల్సిన అవసరం ఏంటి?
– వికసిత్ భారత్ ప్రచారంపై చర్యలు తీసుకున్న ఈసీ
– మోదీపై చర్యల విషయంలో సైలెంట్!
PM Modi latest news(Political news telugu): ఎన్నికల ముందు బహిరంగ సభలు, రోడ్ షోలలో ఎన్ని వాగ్దానాలైనా చేయొచ్చు. కానీ, అధికారికంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక కూడా కొందరు నేతలు ఇష్టారీతిన మాట్లాడడం ఎన్నికల ప్రచారంలో కనిపిస్తోంది. ప్రత్యర్థులపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి వారిపై ఎన్నికల సంఘం ఇలాంటి ఓ కన్నేసి ఉంచాలి. కానీ, ఆ పని సక్రమంగా జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న విద్వేషపూరిత ప్రసంగాలే అందుకు ఉదాహరణగా చెబుతున్నాయి ప్రతిపక్షాలు.
ఓటమి భయంతోనే మోదీ మాట్లాడుతున్నారా?
మూడోసారి అధికారాన్ని సాధించుకోబోతున్నామంటూ ఎన్నికల ప్రచారంలో తెగ ఊదరగొడుతున్నారు మోదీ. కానీ, పదేళ్ల పాలనను చూసిన జనం మరో అవకాశం ఇస్తారా లేదా? అని లోలోపల ఆయన భయపడుతున్నారనే ప్రచారం ఉంది. పదేళ్ల తమ పాలనకు రెఫరెండమ్‌గా మారిన ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి తప్పకుండా తగిన బుద్ధి చెప్తారని మోదీకి ముందే తెలిసిందని, అందుకే, ప్రచార సభల్లో ప్రధానినన్న విషయాన్ని కూడా మరిచిపోయి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్న రాజస్థాన్‌లోని జాలౌర్ ఎన్నికల సభలో, యూపీలోని అలీగఢ్ ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన విద్వేషపూరితమైన వ్యాఖ్యలను విశ్లేషిస్తే, బీజేపీ నేతలకు ఓటమి భయం పట్టుకొన్నట్టు స్పష్టమవుతోందని అంటున్నారు విపక్ష నేతలు.
అన్ని వర్గాలలో వ్యతిరేకత
పెరిగిపోతున్న నిత్యావసరాలు, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు, మరోవైపు దేశవ్యాప్తంగా రైతు వ్యతిరేకత, నిరుద్యోగ భారతం అంతా కలిసి పదేళ్ల బీజేపీ సర్కార్ పాలనపై అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు కనిపిస్తున్నది. నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ ఇటీవల చేసిన సర్వేలో తేలింది. నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారిందని ఈ సర్వేలో పాల్గొన్న 62 శాతం మంది పేర్కొనగా, ధరల మంటతో పేద, మధ్యతరగతి బతుకులు చిన్నాభిన్నమౌతున్నాయని 71 శాతం మంది కుండబద్దలు కొట్టారు. సరిగ్గా ఎన్నికల ముందే బయటపడ్డ బాండ్ల వివాదం బీజేపీకి పెద్ద షాక్‌నిచ్చింది.
పదేళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేకే!
ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ దాడులు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వంటి ప్రముఖుల అరెస్టు, వీటితోపాటు గతంలో మణిపూర్‌లో చెలరేగిన హింస, మైనారిటీలపై కొనసాగుతున్న దాడులు, సాగుచట్టాలకు సంబంధించి రైతన్నల నిరసనలు, ప్రాణత్యాగాలు, పెద్దనోట్ల రద్దు వంటి విషయాలు.. అధికార బీజేపీ ప్రభుత్వంపై సామాన్యుల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. వెరసి గడిచిన పదేళ్లలో చెప్పుకొందామంటే గొప్ప పనులంటూ ఏమీ లేకపోవడంతోనే ప్రధాని మోదీ మతాల పేరిట విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు విపక్ష నేతలు. ‘400 సీట్లు పక్కా’ అంటూ పైకి గప్పాలు కొడుతున్నప్పటికీ, విజయావకాశాలపై బీజేపీ నేతలకు అనుమానాలు ఉన్నట్టు మోదీ వ్యాఖ్యలను చూస్తే అర్థమవుతోందని చెబుతున్నారు.
ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు అవసరమా?
కాంగ్రెస్ వస్తే సంపదంతా ముస్లింలకే. అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నేతలు మహిళల మంగళ సూత్రాల్నీ వదలరు అంటూ రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడిన విషయాన్ని ప్రతిపక్షాలు సీరియస్ గా తీసుకున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దేశ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పకపోతే ఆయనను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని కోరింది. ఇప్పటికే రెండు సార్లు ఆయన కోడ్ ఉల్లంఘించారనేది విపక్షాల వాదన. గతేడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో మోదీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే దేశ ప్రజలకు అడ్డగోలుగా వాగ్దానాలు ఇచ్చేశారు. అలాగే, ఇటీవల తెలంగాణకు వచ్చిన సందర్భంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యల్ని వక్రీకరించారని, ఆయన వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. భారత్ న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ ‘శక్తి’పై చేసిన వ్యాఖ్యల ఉద్దేశం వేరని, వాటిని ప్రధాని వేరే అర్థం వచ్చేలా జగిత్యాల సభలో చెప్పారని ఆరోపించారు. ఈ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలకు గాను చర్యలు తీసుకోవాలని కోరారు.
వికసిత్ భారత్ విషయంలోనూ అంతే!
ప్రభుత్వం మనదే అడిగే వాడు ఎవడు అన్నట్టుగా బీజేపీ నేతలు సోషల్ మీడియాలో వికసిత్ భారత్ ప్రచారాన్ని జోరుగా చేశారు. దీనిపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సోషల్ మీడియాలో వస్తున్న వికసిత్ భారత్ ప్రచారాన్ని ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇలా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు విరుద్ధం అని తేల్చి చెప్పింది. తక్షణమే వాట్సాప్‌లో వస్తున్న వికసిత్ భారత్ మెసేజ్‌లను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖకు ఈసీ నోటీసులు జారీ చేసింది. అయితే, మోడీ ప్రసంగాలపై ఇంతవరకు చర్యలు తీసుకున్నది లేదు. ఇక ప్రభుత్వ వార్తా ఛానెల్ దూరదర్శన్ లోగో రంగు బీజేపీ కలర్ లోకి మారడం, అదికూడా ఎన్నికల సమయంలో జరగడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ ఛానెల్‌ను అధికార ప్రభుత్వం కాషాయీకరణ చేసిందని ఆరోపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు లోగోను మార్చాల్సిన అవసరం ఏమిటని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎన్నికలు జరిగే ప్రతిసారీ కోడ్ నియమావళిని దేశ ప్రధానిగా ఉండి ఉల్లంఘించడం అనేది క్షమించరాని తప్పయితే, ఆయనపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోవపోవడం మరో ఘోరమైన తప్పుగా చెబుతున్నారు విపక్ష నేతలు