KCR: తెలంగాణలో 14 లోక్ సభ స్థానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నం చేస్తున్నది. ఇందుకు అనుగుణంగా సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థులతో కలిసి బలంగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శల దాడి చేస్తున్నారు. తాజాగా ఆయన సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. దానం నాగేందర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారిగా మిలాఖత్తయిందని, లిక్కర్ కేసులో నుంచి ఎమ్మెల్సీ కవితను బయటికి తీసుకురావడానికి బీఆర్ఎస్ ఎంపీ సీట్లను పణంగా పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్‌లో పద్మారావు పరువు తీసే పని పెట్టుకున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కవితను బయటికి తెచ్చుకోవడానికి పద్మారావును ఓడించి తద్వార కిషన్ రెడ్డిని గెలిపించాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు.
సికింద్రాబాద్‌లో కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు మంచివారేనని, కానీ, ఆయన వెనుక ఉన్న గురువే పిట్టల దొర అని కేసీఆర్‌పై కామెంట్లు చేశారు. అసలు పద్మారావుకు కేసీఆర్ మద్దతే కనిపించడం లేదని, ఆయన నామినేషన్‌కు పట్టుమని పది మంది కూడా కనిపించలేదని అన్నారు. పద్మారావు నామినేషన్ కార్యక్రమానికి కేసీఆర్, కేటీఆర్‌లు ఎందుకు రాలేదో వివరించాలని ప్రశ్నించారు.
Also Read: కేంద్రంలో కాంగ్రెస్.. ఈసారి విజయం పక్కా!
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ని ప్రయత్నాలు చేసినా కవితకు బెయిల్ రావడం లేదు. తిహార్ జైలు నుంచి బయటికి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఉన్నది. ఇది వరకు కూడా ఈ ఆరోపణలను రేవంత్ రెడ్డి చేశారు. ఐదు సీట్లను కేసీఆర్.. బీజేపీకి పణంగా పెట్టారని అన్నారు. ఆ ఐదు సీట్లల్లో నామమాత్రంగా అభ్యర్థులను నిలబెట్టి బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చుతారని, తద్వార బీజేపీ లబ్ది పొందుతుందని వివరించారు. సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని గెలిపించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, అందుకే ఇక్కడ నిలబెట్టిన పద్మారావుకు ఆయన మద్దతు ఇస్తున్నట్టు లేదని ఆరోపించారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు దానం నాగేందర్‌ను ముందు ఉంచారని, దానం నాగేందర్‌ను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించాలని రేవంత్ రెడ్డి కోరారు. సికింద్రాబాద్‌లో ఏ పార్టీ గెలిస్తే కేంద్రంలో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని వివరించారు. ఆనాడు దత్తాత్రేయను అంజన్ కుమార్ యాదవ్ ఓడించి మూడు రంగుల జెండా ఎగరేశారని, అప్పుడు కేంద్రంలో సోనియమ్మ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే పునరావృతం కాబోతున్నదని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నదని, ఇక్కడ దానం నాగేందర్ గెలువబోతున్నారని వివరించారు. మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. దానం నాగేందర్ కేంద్రంలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారని పేర్కొన్నారు.
Also Read: క్రెడిట్ వస్తే మనదే.. తేడా వస్తే పక్కోడి మీదకు తోసేయడమే
ఇక్కడి నుంచి దత్తాత్రేయ, కిషన్ రెడ్డిలు గెలిచి మంత్రులయ్యారని, కానీ, సికింద్రాబాద్‌కు వారు తెచ్చిందేమిటీ? చేసిందేమిటీ? అని ప్రశ్నించారు. బీజేపీ మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.