Telangana Police: 24గంటల్లో మూడు ఆలయాలు ఆరు షాపుల్లో దొంగతనాలు చేసిన అంతర్ రాష్ట్ర ముఠాను సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఐఎస్ సదన్ పోలీసులతో కలిసి మూడు రోజుల్లోనే అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 4 లక్షల రూపాయల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సౌత్ ఈస్ట్ జోన్ ఇన్ ఛార్జ్ డీసీపీ స్నేహా మెహ్రా టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు, అదనపు డీసీపీ శ్రీకాంత్, ఏసీపీ సుఖ్ దేవ్ సింగ్ తో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం టౌన్ వాస్తవ్యులైన జువ్వాల తరుణ్ కుమార్ రాజు (21), ఎల్లయ్య రాజు (22), మరుబోయిన మావుళ్లు (19), గండ్రెడ్డి లోకేశ్ (19) చిన్నప్పటి నుంచి స్నేహితులు. తేలికగా డబ్బు సంపాదించటానికి మైనారిటీ తీరక ముందు నుంచే దొంగతనాలకు అలవాటు పడ్డారు.
ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో కేసులు నమోదు
ఈ క్రమంలో ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. పలుమార్లు అరెస్టయి జైలుకు కూడా వెళ్లారు. అయితే, తమ ప్రవృత్తిని మార్చుకోలేదు. టార్గెట్ గా చేసుకున్న ప్రాంతాలకు వెళుతూ అద్దెకు ఇళ్లు తీసుకుని రెక్కీ జరిపి మరీ ఒకటి రెండు రోజులు వరుసగా నేరాలకు పాల్పడి స్వస్థలానికి వెళ్లిపోయేవారు. ఇలా ఈ గ్యాంగ్ అపహరించుకుని తెచ్చిన సొత్తును లోకేశ్ భార్య రజ్జీ (18) మరో మైనర్ బాలునితో కలిసి విక్రయించేది. భీమవరంలో నేరాలు చేస్తే తేలికగా దొరికిపోతామని భావించిన తరుణ్ కుమార్ రాజు, ఎల్లయ్య రాజు, మరుబోయిన మావుళ్లు, లోకేశ్ లు తమతోపాటు మైనర్ బాలున్ని తీసుకుని ఇటీవల నేరాలు చేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్ వచ్చారు.
ఆరు షాపుల్లోకి చొరబడి విలువైన సొత్తు
వస్తూ వస్తూ నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో నుంచి ఓ పల్సర్ బైక్ ను అపహరించి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తరువాత హయత్ నగర్ స్టేషన్ పరిధి నుంచి మరో పల్సర్ బైక్ ను తస్కరించారు. అనంతరం నాదర్ గుల్ కమ్మగూడలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఈనెల 5న అర్ధరాత్రి దాటిన తరువాత రెండు బైక్ లపై బయల్దేరి ఐఎస్ సదన్, సరూర్ నగర్, సైదాబాద్, బేగంబజార్, సుల్తాన్ బజార్ స్టేషన్ల పరిధుల్లోని మూడు దేవాలయాలు, ఆరు షాపుల్లోకి చొరబడి విలువైన సొత్తును దోచుకున్నారు. ఆ మరుసటి రోజు చోరీ చేసిన సొత్తుతో భీమవరం ఉడాయించారు. తిరిగి ఈనెల 7న ముఠా మొత్తం మరోసారి హైదరాబాద్ కు వచ్చింది.
4లక్షల రూపాయల సొత్తును స్వాధీనం
ఈసారి నిందితులు రజ్జీని కూడా వెంటబెట్టుకుని వచ్చారు. ఇంతకు ముందు అద్దెకు తీసుకున్న ఇంట్లో బస చేశారు. కాగా, వరస చోరీలు కలకలం సృష్టించిన నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ సీఐ సైదాబాబు, ఐఎస్ సదన్ సీఐ నాగరాజు, డీఐ కరుణకుమార్, ఎస్ఐలు రామారావు, మధుతోపాటు సిబ్బందితో కలిసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మొదట తరుణ్ కుమార్ రాజును చంపాపేట ప్రాంతంలోని ఓ ఆలయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను వెల్లడించిన వివరాల మేరకు కమ్మగూడ వెళ్లి గ్యాంగులోని మిగితా సభ్యులను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 4లక్షల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి జైలుకు రిమాండ్ చేశారు.
Also Read: Telangana Police: మొబైల్ ఫోన్ల రికవరీలో అగ్రస్థానం.. మరో ఘనత సాధించిన తెలంగాణ పోలీస్!
