Temple Theft Gang: ఆలయాలనే టార్గెట్‌గా చేసుకుని వరుసగా నేరాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర గ్యాంగును కూకట్ పల్లి జోన్ సీసీఎస్ అధికారులు కేపీహెచ్బీ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 26 లక్షల రూపాయల విలువ చేసే బంగారం, వెండి, రాగి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేపీహచ్బీ డివిజన్ ఏసీపీ రవికిరణ్ రెడ్డి(ACP Ravi Kiran Reddy) బుధవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నీలపు నీలయ్య ఎలియాస్ అనిల్ పాత నేరస్తుడు. మహారాజు మల్లికార్జున్, బాష్య వెంకట మోహిత్ కుమార్, దున్నపోతుల పవన్ కళ్యాణ్ తో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్న నీలయ్య దేవాలయాలను టార్గెట్ గా చేసి చోరీలు మొదలు పెట్టాడు. ముందుగా రెక్కీ నిర్వహించి ఏ ఆలయంలో ఎక్కువ సొత్తు దొరుకుతుందన్నది నిర్ధారించుకున్న తరువాత ఈ ముఠా పకడ్భంధీ పథకం ప్రకారం దొంగతనాలు చేస్తూ వస్తోంది.
బృందంగా ఏర్పడి..
ఈ క్రమంలోనే కేపీహెచ్బీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి ఈనెల 6న అర్ధరాత్రి దాటిన తరువాత చొరబడి బంగారు, వెండి నగలను దొంగిలించి పారిపోయారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన కేపీహెచ్బీ పోలీసులు విచారణ ప్రారంభించారు. కేపీహెచ్బీ స్టేషన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, డీఐ కే.ఎస్.రవి, సీసీఎస్ సీఐ రవికుమార్ ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి దానిని విశ్లేషించటం ద్వారా కీలక ఆధారాలను సేకరించారు. వీటి ద్వారా గ్యాంగులోని మహారాజు మల్లికార్జున్, దున్నపోతుల పవన్ కళ్యాణ్ లను అరెస్ట్ చేశారు. వీరిని జరిపిన విచారణలో చోరీ చేసిన సొత్తును విక్రయించటంలో దండి అనిల్ తేజ, కంబపు విజయ్, తంగిల మణికంఠ దుర్గాప్రసాద్ సహకరిస్తున్నట్టు వెల్లడైంది.
Alsop Read; BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఫండ్ కావాల్సిందే.. నేతల మాటలకు అధిష్టానం షాక్?
అరెస్టులో కీలకపాత్ర..
ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. గ్యాంగ్ లీడర్ నీలయ్య, బాష్య వెంకట మోహిత్ కుమార్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని ఏసీపీ రవికిరణ్ రెడ్డి చెప్పారు. కాగా, రోజుల వ్యవధిలోనే గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసిన సిబ్బందిని కూకట్ పల్లి జోన్ డీసీపీ రితిరాజ్, డీసీపీ (క్రైమ్స్) ముత్యం రెడ్డి, అదనపు డీసీపీ రాంకుమార్, ఏసీపీ నాగేశ్వరరావు అభినందించారు. నిందితుల అరెస్టులో కీలకపాత్ర పోషించిన సిబ్బంది అందరికీ త్వరలోనే రివార్డులు ఇస్తామని తెలిపారు.

