Hyderabad Fire Accident: సిద్దిఅంబర్ బజార్ ప్రాంతంలోని ఓ మూడంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న 8 మందిని రక్షించారు. వీరిలో ఓ పండు ముదుసలితోపాటు ఇంకా నెలరోజుల వయసు కూడా నిండని చిన్నారి ఉండటం గమనార్హం. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిఅంబర్ బజార్ గోల్ మసీదు ప్రాంతంలో ఓ మూడంతస్తుల భవనం ఉంది.
ఫస్ట్ ఫ్లోర్లో డిస్పోజబుల్ ప్లేట్లు, ప్లాస్టిక్ వస్తువుల గోదాము ఉండగా మొదటి అంతస్తులో యజమాని కుటుంబం నివాసముంటోంది. మూడో అంతస్తులో మరో కుటుంబం అద్దెకు నివసిస్తోంది. కాగా, ఉదయం 8 గంటల సమయంలో గోడౌన్ఉన్న అంతస్తులో మంటలు చెలరేగాయి. దాంట్లో ప్లాస్టిక్ డిస్పోజబుల్ సామాన్లు ఉండటంతో క్షణాల్లోనే ఉవ్వెత్తున ఎగిసి పడ్డ మంటలు మిగితా అంతస్తులకు వ్యాపించాయి. కిందకు దిగటానికి వీలు లేకుండా మంటలు వ్యాపించటంతో మొదటి అంతస్తులో ఉంటున్న భవన యజమాని కుటుంబం, మూడో ఫ్లోర్లో కిరాయికి ఉంటున్న వారు తమను కాపాడాలంటూ పెద్దగా కేకలు పెట్టారు.
అవి విన్న స్థానికులు వెంటనే అఫ్జల్ గంజ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో అక్కడికి వచ్చారు. ఒకవైపు నీళ్లు చల్లుతూ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూనే తమ వెంట తీసుకొచ్చిన స్కై లిఫ్ట్ సహాయంతో రెండో అంతస్తులో ఉన్న ముగ్గురితోపాటు భవనం పైకి వెళ్లిన అయిదుగురిని సురక్షితంగా కిందకు దింపారు. వీరిలో 70 యేళ్ల వయసున్న ఓ వృద్ధురాలితోపాటు నెల వయసు కూడా లేని పసికందు ఉన్నారు.
Also Read: Black Jaggery: యథేచ్ఛగా నల్ల బెల్లం దందా.. సహకరిస్తున్నఎక్సైజ్ అధికారులు?
అయితే, మంటలు మాత్రం అంత లేలిగ్గా అదుపులోకి రాలేదు. దాంతో అగ్నిమాపక సిబ్బంది నీళ్లతోపాటు ఫోంను కూడా మంటల పైకి చిమ్మారు. అదే సమయంలో రోబో ఫైరింజన్ ను లోపలికి పంపించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. దాదాపు నాలుగు గంటలు గడిచిన తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి.
రెసిడెన్షియల్ భవనంలో
సంఘటనా స్థలానికి వచ్చి మంటలను ఆర్పే పనులను పర్యవేక్షించిన జిల్లా ఫైర్ ఆఫీసర్ వెంకన్న మాట్లాడుతూ రెసిడెన్షియల్ భవనంలో తేలిగ్గా మండే స్వభావం ఉండే ప్లాస్టిక్ డిస్పోజబుల్ వస్తువులను ఉంచటం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. సకాలంలో చర్యలు చేపట్టటంతో ప్రాణ నష్టం జరగలేదన్నారు. మనుషులు వెళ్ల లేని చోటుకు రోబో ఫైరింజన్ ను పంపించి మంటలను ఆర్పి వేసినట్టు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండ వచ్చన్నారు.
ప్రాథమిక విచారణలో భవనంలో ఉన్న వైరింగ్ చాలాకాలం క్రితం ఏర్పాటు చేసిందని వెల్లడైందన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపితే ప్రమాదానికి కారణామేమిటన్నది స్పష్టం అవుతుందన్నారు. ఇక, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రమాద స్థలానికి వచ్చారు. సహాయక చర్యలను సమీక్షించారు. బేగంబజార్, సిద్దిఅంబర్ బజార్ తదితర ప్రాంతాల్లో ఇళ్లల్లో గోడౌన్ లు ఏర్పాటు చేసుకుంటున్న వారు ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న అందరినీ సురక్షితంగా బయటకు తెచ్చిన అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు.
Also Read: Naveen Chandra: ఆ విషయంలో నవీన్ చంద్ర భార్యను టార్చర్ చేస్తున్నాడా?