Matrimonial Scam: అందమైన పెళ్లికూతురి కోసం మ్యాట్రిమోనియల్ సైట్ల(Matrimonial sites)లో సెర్చ్ చేసే వారిని ఉచ్చులోకి లాగుతూ లక్షలు వసూలు చేస్తున్న గ్యాంగ్ లోని ఇద్దరిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు(Hyderabad Cyber Crime Police) అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితురాలి కోసం గాలిస్తున్నారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే పాకిస్తాన్ కు చెందిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ పోటోలను సైట్ లో అప్ లోడ్ చేసి నిందితులు మోసానికి పాల్పడటం. సైబర్ క్రైం డీసీపీ దార కవిత(DCP Dhara kavitha) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ఆమెనే వివాహం చేసుకోవాలని..
హైదరాబాద్(Hyderabad) కు చెందిన ఓ వ్యక్తి రెండున్నరేళ్ల క్రితం పెళ్లి చేసుకోవాలనుకుని అందమైన వధువు కోసం గాలింపు మొదలు పెట్టాడు. ఈ క్రమంలో కూబ్ సూరత్ రిష్తే అన్న ఇన్ స్టాగ్రాం(Instagram) ఐడీని బ్రౌజ్ చేస్తుండగా ఓ అందమైన యువతి ఫోటో కనిపించింది. ఆమెనే వివాహం చేసుకోవాలనుకున్న బాధితుడు ఇన్ స్టాగ్రాం ఐడీలో ఇచ్చిన నెంబర్ కు ఫోన్ చేశాడు. అప్పుడు ఫోటోలో ఉన్న యువతిలా మాట్లాడిన నిందితురాలు బాధితునికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకుని పెళ్లి చేసుకోవటానికి తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది. ఆ తరువాత తరచూ ఫోన్లు చేసి బాధితున్ని పూర్తిగా వలలోకి లాగింది. ఆ తరువాత వేర్వేరు కారణాలు చెబుతూ పలు దఫాలుగా అతని నుంచి 25లక్షల రూపాయలను తాను చెప్పిన అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేయించుకుంది.
Also Read: KTR: అంగట్లో కొలువులను అమ్ముకున్న ప్రభుత్వం: కేటీఆర్
మోసానికి పాల్పడ్డ నిందితురాలు
ఆ తరువాత బాధితునికి ఇన్ స్టాగ్రాం ఐడీలో ఉన్న ఫోటో పాకిస్తాన్ కు చెందిన ఇన్ ఫ్లూయెన్సర్ దని తెలిసింది. దాంతో ఫోన్ చేసి డబ్బు వాపసు చేయమని అడుగగా మోసానికి పాల్పడ్డ నిందితురాలు అతనితో మాట్లాడటం మానేసింది. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు చేయగా సీఐ ప్రసాదరావు(CI Prasad Rao) కేసులు నమోదు చేశారు. ఏసీపీ శివమారుతి(ACP Shiva Maruthi) పర్యవేక్షణలో ఎస్ఐ ఉమ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ ఫౌజియా బేగంతో కలిసి విచారణ ప్రారంభించారు. కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ కు చెందిన అనీసా మహ్మదీయాసిన్ హుండేకర్ (33), జోహర్ ఫాతిమా (24)తోపాటు హైదరాబాద్ కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఆమెర్ (31)తో కలిసి మోసానికి పాల్పడినట్టుగా నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో అనీసా, మహ్మద్ అబ్దుల్ ఆమెర్ లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న జోహర్ ఫాతిమా గురించి గాలిస్తున్నారు.