Bachupally Police: బాచుపల్లిలో బుధవారం కలకలం రేపిన సూట్ కేసులో మహిళా మృతదేహం కేసును సైబరాబాద్ బాచుపల్లి పోలీసులు చేధించారు. సీసీ కెమెరాల ఆధారంగా 24 గంటల్లోనే నిందితుడిని గుర్తించి, హత్యకు దారితీసిన కారణాలను వెలికితీశారు.
వివాహేతర సంబంధమే హత్యకు కారణమా ?
మృతురాలు బోహ్ర (33)నేపాల్‌కు చెందిన మహిళ. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన విజయ్ అనే వ్యక్తికి బోహ్ర కు మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో విజయ్.. బొహ్రను తమ పిల్లలతో కలిపి నేపాల్ నుంచి నగరానికి గత నెల తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. నిందితుడు విజయ్ దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బౌరంపేటలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల బొహ్ర తాను మళ్లీ గర్భం దాల్చిన విషయాన్ని విజయ్ కు తెలిపింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర గొడవ చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘర్షణే చివరకు హత్యకు దారితీసినట్టు సమాచారం.
Also Read: Constable Sells Ganja: సీజ్ చేసిన గంజాయి అమ్మకం.. సూత్రధారి ఎక్సైజ్ కానిస్టేబులే!
మే 23న హత్య – సూట్ కేసులో శవం
సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు ప్రాథమిక దర్యాప్తులో విషయాలు వెలుగు చూసినట్లు తెలిసింది. విజయ్ మే 23ననే బొహ్రను హత్య చేసి నట్లు తెలిసింది. అనంతరం కేపిహెచ్‌బీ ప్రాంతంలో ట్రావెల్ బ్యాగ్ కొనుగోలు చేసి, మృతదేహాన్ని అందులో పెట్టాడు. తర్వాత విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలోని నిర్మానుష్య ఖాళీ ప్రదేశంలో ఆ బ్యాగ్‌ను వదిలి వెళ్లిపోయాడు. బ్యాగ్ కనిపించిన రోజు ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు, బ్యాగ్‌ను అక్కడ వదిలి వెళ్లిన వ్యక్తిని గుర్తించారు.
నిందితుడి కదలికలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నాలుగు పోలీసు బృందాలు సీసీటీవీలో పరిశీలించి అతనిని పట్టుకోవడానికి రంగంలోకి దిగాయి. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన విషయం విధితమే. హత్యకు ఖచ్చితమైన కారణాలు, నిందితుడి వ్యవహార శైలి తదితర అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.
Also Read: World Environment day: ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్.. వాడకాన్ని తగ్గించాలి!