Constable Sells Ganja: కంచే చేను మేస్తే..అన్న సామెత ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్‌కు అచ్చంగా సరిపోతుంది. గతంలో ఎక్సైజ్ అధికారులకు పట్టుబడి సీజ్ అయిన గంజాయిని అదే శాఖకు చెందిన కానిస్టేబుల్ విక్రయించడానికి ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. ఈ సంచలన ఘటనకు సంబంధించిన వివరాలను షాద్ నగర్ సీఐ విజయ్ కుమార్ స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
అనుమానాస్పదంగా కనబడ్డ ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు
బక్రీదు పండుగ సందర్భంగా ఈనెల షాద్ నగర్ పట్టణంలో ఎస్సై దేవరాజ్ తన సిబ్బందితో సాధారణ తనిఖీలు చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనబడ్డ ఓ యువకుడిని అదుపులోకి తీసుకోగా అతని వద్ద కిలోన్నర గంజాయి లభించింది. అతన్ని విచారించగా..తన పేరు మహ్మద్ అంజద్ అని, వరుసకు బాబాయి అయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గులాం సుల్తాన్ అహ్మద్ గంజాయిని విక్రయించమని తనుకు అప్పగించాడని చెప్పినట్లు సీఐ తెలిపారు.
Also Read: Complaints To Hydraa: నాలాల ఆక్రమణలపై ..హైడ్రాకు ఫిర్యాదులు!
తాండూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో స్వాధీనం
గంజాయిని అమ్మే క్రమంలో అంజద్ షాద్ నగర్ పోలీసులకు చిక్కినట్లు చెప్పారు. గులాం సుల్తాన్ అహ్మద్ తాను కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తాండూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో స్వాధీనం చేసుకున్న గంజాయిని తీసుకువచ్చి తన బంధువు అంజద్ ద్వారా అమ్మకానికి పెట్టినట్లు సీఐ వివరించారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ గులాం సుల్తాన్ అహ్మద్, అంజద్ ఇరువురులను గురువారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. 75 వేల విలువగల గంజాయితోపాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలి
నిందితులు జల్సాలకు అలవాటు పడి సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని గంజాయి విక్రయాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. శంషాబాద్ డిసిపి రాజేష్, అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, షాద్ నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని చేధించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై దేవరాజును అభినందిస్తూ వారికి తగిన రివార్డు కోసం పై అధికారులకు సిఫార్సు చేయడం జరిగిందని సిఐ విజయకుమార్ తెలిపారు.
Also Read: Hydraa on Fire Safety: స్వేచ్ఛ కథనంతో కదిలిన హైడ్రా.. ఫైర్ సేఫ్టీ నిబంధనల్లో మార్పులు!