Hydraa on Fire Safety: పాతబస్తీ చార్మినార్ లో భారీ అగ్నిప్రమాదం జరిగి ఏకంగా 17 మంది అగ్నికి ఆహుతి అయిన ఘటనతోనైనా ఇకపై పాలకులు, అధికారులు, సామాన్య ప్రజల్లో వ్యవహార శైలిలో మార్పువస్తుందా? అన్న ప్రశ్నకు ఇకనైనా మారాలి అన్న వాదనలు సమాధానంగా విన్పిస్తున్నాయి. ముఖ్యంగా ప్రమాదాలు, వరదల నివారణతో పాటు ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఎలాంటి చట్టాలు తెచ్చినా, వాటి అమలు కేవలం న్యూసిటీకి పరిమితమవుతుండగా, ఇకపై పాతబస్తీలో కూడా కట్టుదిట్టంగా అమలు చేయాలన్న విషయంపై సర్కారు ఫోకస్ చేసినట్లు సమాచారం. ఎలాంటి కొత్త రూల్స్ వచ్చిన న్యూ సిటీలో మాదిరిగా ఓల్డ్ సిటీలో అమలు చేసేందుకు దాదాపు అన్ని సర్కారు శాఖల అధికారులు వెనకంజ వేస్తున్న కారణంగానే ఫైర్ సేఫ్టీని అమలు చేయటంపై వహించిన నిర్లక్ష్యం కారణంగానే అగ్ని ప్రమాదానికి 17 మంది బలి కాగా, వీరిలో నెలల వయస్సుతో పాటు పదేళ్లలోపు వయస్సు గల చిన్నారులు ఎనిమిది మంది మృతి చెందటంతో పాతబస్తీ వాసులు మైండ్ సెట్ ఇకనైనా మారాలన్నవాదనలున్నాయి.
శిథిల భవనాల్లో నివసిస్తున్న పాతబస్తీ వాసులు
ప్రమాదం జరిగిన భవనంలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు ఉంటే ఇంత భారీస్థాయిలో ప్రాణ నష్టం జరిగేది కాదని, కనీసం భవనానికి ఎంట్రెన్స్, ఎగ్జిట్లు వేర్వేరుగా ఉండి ఉన్నా, ప్రాణ నష్టం చాలా తగ్గలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నందున, పాతబస్తీ వాసులు కనీసం తమ భద్రతను దృష్టిలో ఉంచి, భవనాల్లో పాటించాల్సిన అన్ని రకాల నిబంధనలను పాటించటంతో పాటు శిథిల భవనాల పరిస్థితిని గుర్తించి తిగిన జాగ్రత్తలు పాటించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాతబస్తీలో నివాసమున్నవారితో పాటు సెలవు రోజుల్లో హైదరాబాద్ నుంచి చూసేందుకు వచ్చి బంధువుల ఇంట్లో బస చేసిన వారంతా మృతి చెందటం ప్రతి ఒక్కరిని కదిలించింది.
పలు రకాల చట్టాలను ఉల్లంఘిస్తూ, శిథిల భవనాల్లో నివసిస్తున్న పాతబస్తీ వాసులు ఇప్పటికే డేంజర్ లో ఉండగా, వారిని చూసేందుకు సిటీకి వచ్చిన వారు అగ్నికి ఆహుతి కావటాన్ని గుర్తించైనా పాతబస్తీవాసులు ఇకనైనా మారాలన్న వాదనలున్నాయి. ఇదే రకం మార్పు వివిధ శాఖల అధికారులతో పాటు సర్కారులో కూడా రావాలని పాతబస్తీ వాసులు కొందరు కోరుతున్నారు. రోజురోజుకి పట్టణీకరణ పెరుగుతున్న హైదరాబాద్ నగరానికి ఓ స్ట్రాంగ్ ఫైర్ సేఫ్టీ విధానాన్ని తీసుకురావాలని, ఈ విధానం మొత్తం రాష్టంలోని అన్ని స్థానిక సంస్థల్లో అమలు చేసేలా యూనిఫామ్ విధానంగా రూపకల్పన చేసేందుకు సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఓ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించేందుకు సర్కారు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
Also Read: Crime News: కారం చల్లి.. కత్తులతో అల్లుడు పై దాడి చేసిన అత్త, మామ
రొటీన్ డైలాగులేనా ఏమైనా అమలుంటుందా?
ఇప్పటి వరకు వరుసగా జరిగిన అగ్నిప్రమాదాలు, నిర్మాణంలో ఉన్న భవనాలు, శిథిల భవనాలు కూలి పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనల సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు చార్మినార్ ఫైర్ యాక్సిడెంట్ కు సంబంధించి కూడా ఫైర్ సేఫ్టీ విధానాల్లో మార్పులు తేనున్నట్లు ప్రకటించారు. ఇది ఘటనలు జరిగినప్పటికీ రొటీన్ డైలాగులాగే మిగిలిపోతుందా? లేక ఏమైన అమలవుతుందా? అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మూడేళ్ల క్రితం బోయిగూడలోని గోదాములో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 మంది సజీవ దహనం, రెండేళ్ల క్రితం సికిందరాబాద్ వైఎంసీఏ వద్దనున్న ఎలక్ర్టిక్ బైక్ ల బ్యాటరీలగోదాములో ఫైర్ యాక్సిటెండ్ జరిగి తొమ్మిది మంది, ఏడాదిన్న కాలం క్రితం దక్కన్ ప్లాజాలో ముగ్గురు, ఆ తర్వాత సికిందరాబాద్ స్వప్నలోక్ లో ఆరుగురితో పాటు తాజాగా పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరో 17 మంది మృతి చెందిన ఘటనతో స్పందించిన సర్కారు ఫైర్ సేఫ్టీ నిబంధనల్లో మార్పులు చేసే విషయంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రమాదాలు జరిగినపుడు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతామంటూ సింపుల్ గా జవాబు చెబుతూ, ప్రాణాలకు పరిహారంతో లెక్క కట్టి మౌనం వహిస్తారా? లేక ఫైర్ సేఫ్టీ ప్రమాణాల అమలుపై ఏమైనా ముందుకెళ్తారా? వేచి చూడాలి. తదుపరి అగ్ని ప్రమాదం జరిగి, అమాయకుల బతుకులు కాలిపోక ముందే సర్కారు సంచలనాత్మక నిర్ణయం తీసుకోవాలన్న వాదనలు విన్పిస్తున్నాయి.
త్వరలో స్పెషల్ డ్రైవ్
భవన నిర్మాణ అనుమతి మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న అనుమతుల ప్రకారం భవన నిర్మాణం మొత్తాన్ని పూర్తి చేసిన తర్వాత, ఫైర్ సేఫ్టీ మెజర్స్ అమర్చుకున్న తర్వాత హైడ్రాలోని ఫైర్ వింగ్ భవనాన్ని తనిఖీ చేసి, ఫైర్ ఎన్ఓసీ జారీ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత భవనానికి అక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. కానీ నగరంలోని నూటికి తొంభై శాతం బహుళ అంతస్తు భవనాలకు ఫైర్ సేఫ్టీ లేకపోయినా,వాటికి ఫైర్ ఎన్ఓసీలున్నాయి. ఇక మరి కొన్ని భవనాలకు ఫైన్ ఎన్ఓసీ లేకపోయినా, అక్యుపెన్సీ సర్టిఫికెట్లున్నాయి. వీటి లెక్క తేల్చేందుకు త్వరలోనే హైడ్రా స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.
వీటిలో ఫైర్ ఎన్ఓసీ అడ్డదారిలో పొందిన భవనాలను, ఫైర్ సేఫ్టీ లేకపోయినా బ్యాక్ డోర్ నుంచి అక్యుపెన్సీ సర్టిఫికెట్లను జారీ చేసిన భవనాలను గుర్తించి తాకీదులు జారీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇలా గుర్తించిన భవానాల్లో తాజాగా ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏర్పాటు చేసేందుకు అనుకూలమైన భవనాల్లో వాటిని ఏర్పాటు చేయాలని, వంద శాతం ఏర్పాటు చేసే అవకాశం లేకపోతే ఇలాంటి భవనాలకు ఎంట్రెన్స్, ఎగ్జిట్ లు వేర్వేరుగా ఉండేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని హైడ్రా, జీహెచ్ఎంసీలు భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: YSRCP: సీన్ రివర్స్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి..