Crime News (imagecredit:twitter)
క్రైమ్

Crime News: జన్మనిచ్చి అల్లారుముద్దుగా పెంచారు.. కానీ చివరికి!

Crime News: కడుపున పుట్టిన వాళ్లే కాల యములవుతున్నారు. జన్మనిచ్చి అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులనే కాటికి పంపిస్తున్నారు. 2వేల రూపాయల కోసం ఒకడు తల్లిని బండరాయితో కొట్టి చంపేస్తే మరో ఉదంతంలో నిన్నగాక మొన్న పరిచయమైన యువకుని కోసం ఓ మైనర్ యువతి తల్లిని సుత్తితో కొట్టి కొట్టి హతమార్చింది. ఇంకో యువతి తన వివాహేతర సంబంధానికి(Extramarital affair) అడ్డొస్తున్నాడని తండ్రిని పథకం ప్రకారం అంతం చేసింది. ఇలాంటి ఉదంతాలు తరచూ వెలుగు చూస్తుండటంపై మానసిక వైద్యులతో మాట్లాడగా ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవటం న్యూక్లియర్​ఫ్యామిలీలు పెరిగి పోతుండటం ప్రధాన కారణమని చెప్పారు. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు నానాటికీ పలుచనై పోతుండటం మరో కారణమన్నారు. చాలా ఫ్యామిలీల్లో తల్లిదండ్రులు(Parents) తమ పిల్లల కోసం కనీసం రెండు గంటల సమయం కూడా కేటాయించక పోవటం గమనార్హమని చెప్పారు. మరోవైపు సినిమా మొదలుకుని టీవీల వరకు హింసాత్మక చిత్రాలు కార్యక్రమాలు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని కనబరుస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే కొందరు కోరుకున్న దాని కోసం ఎంతకైనా తెగిస్తున్నారని విశ్లేషించారు.

కల్లులో నిద్రమాత్రలు కలిపి తాగించి
జీడిమెట్ల(Jeedimetla)లో ఉంటున్న 10వ తరగతి విద్యార్థిని తన ప్రేమకు అడ్డు వస్తోందని ప్రియుడు శివ అతని తమ్ముడు యశ్వంత్‌‌తో కలిసి తల్లి అంజలిని సుత్తితో తలపై కొట్టి కిరాతకంగా హత్య చేసింది. ఇటీవల జరిగిన ఈ దారుణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. సుత్తితో కొట్టినా చనిపోలేదని ఇంటి నుంచి వెళ్లిపోయిన శివ, యశ్వంత్ లకు ఫోన్​ చేసి వెనక్కి పిలిపించి మరీ ఆ యువతి అంజలి ప్రాణం తీసింది. ఈ కిరాతకాన్ని మరిచిపోక ముందే మనీషా అనే యువతి తన వివాహేతర సంబంధానికి అభ్యంతరం చెబుతున్నాడని తండ్రి వడ్లూరి లింగంను ప్రియుడు మహ్మద్​జావీద్, తల్లి శారదలతో కలిసి హత్య చేసింది. కల్లులో నిద్రమాత్రలు కలిపి తాగించి లింగం మత్తులోకి వెళ్లిన తరువాత ముఖంపై దిండుతో అదిమి పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఆ తరువాత ప్రియుడు, తల్లితో కలిసి సెకండ్​షో సినిమా చూసి వచ్చి కారులో తండ్రి మృతదేహాన్ని ఎదులాబాద్​లక్ష్మీనారాయణ చెరువులోకి విసిరేసింది. దీనికి కొన్ని రోజుల ముందు మద్యానికి బానిసగా మారిన నిజాంపేట నివాసి రామచంద్రన్ తల్లి దుర్గవ్వ పెన్షన్​గా వచ్చిన 2వేల రూపాయలు ఇవ్వలేదని ఆమెను బండరాయితో తలపై ప్రాణం పోయేదాకి కొట్టి చంపాడు. ఇటీవలిగా ఈ తరహా దారుణాలు తరచూ వెలుగు చూస్తుండటం అన్నివర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

కుటుంబంలో ఏదైనా విషాదం
దీనిపై గాంధీ ఆస్పత్రిలో మానసిక వైద్యునిగా పని చేస్తున్న డాక్టర్ అజయ్‌తో మాట్లాడగా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై పోవటం ప్రధాన కారణమని చెప్పారు. గతంలో ముగ్గురు నలుగురు అన్నదమ్ములు కుటుంబాలతోకలిసి ఉండేవారన్నారు. ఏ సమస్య వచ్చినా అందరూ కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకునే వారని చెప్పారు. చిన్నవాళ్లు పెద్దల మాటకు గౌరవం ఇచ్చేవారని తెలిపారు. వారికి ఎదురు సమాధానం కూడా ఇచ్చేవారు కాదన్నారు. పండుగలు వచ్చినా శుభకార్యాలు జరిగినా అంతా కలిసి ఆనందంగా జరుపుకునే వారని చెప్పారు. కుటుంబంలో ఏదైనా విషాదం జరిగినా మిగిలిన వారు ఒకరికొకరు తోడుగా నిలబడేవారని తెలిపారు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలకు బంధాలు అనుబంధాల ప్రాధాన్యత చిన్నప్పటి నుంచే ఆటోమేటిక్‌గా తెలిసిపోయేదని వివరించారు.

Also Read: Vadhannapet: వర్ధన్నపేట మండలంలో మట్టిబొమ్మకు పూజలు.. జనం పరుగులు

రోజులో కనీసం రెండు గంటల సమయం
ప్రస్తుతం దీపం పట్టుకుని వెతికినా ఉమ్మడి కుటుంబాలు కనిపించటం లేదని డాక్టర్ అజయ్​చెప్పారు. గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. మేమిద్దరం మాకిద్దరు అంటూ చాలామంది కుటుంబాల నుంచి విడిపోయి వేరుగా ఉంటున్నారని చెప్పారు. ఇక, చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారని వీళ్లు తమ తమ పిల్లలకు రోజులో కనీసం రెండు గంటల సమయం కూడా కేటాయించటం లేదన్నారు. దాంతో పిల్లలు టీవీ షోలు సినిమాలు మొబైల్ ఫోన్లలో పోర్న్​సైట్లు చూస్తూ పెరుగుతున్నారన్నారు. తమ గురించి పట్టించుకునే వాళ్లు లేకపోతుండటంతో మొండిగా తయారవుతున్నారని వివరించారు. కోరుకున్నది ఎలాగైనా సరే సాధించుకోవాలని అనుకుంటున్నారన్నారు. సెల్​ఫోన్​కొనివ్వలేదని బైక్​ఇప్పించ లేదని మైనారిటీ తీరని యువతీ, యువకులు ఆత్మహత్యలు చేసుకోవటం దీనిని స్పష్టం చేస్తోందన్నారు. కొంతమంది తల్లిదండ్రుల నుంచి దొరకని ప్రేమను ఇతరుల్లో వెతుక్కుంటున్నారని దానిని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తే ఎంతటి దారుణాలకైనా తెగబడుతున్నారన్నారు. జీడిమెట్లలో జరిగిన అంజలి దారుణ హత్య దీనిని నిరూపిస్తోందన్నారు.

మంచి ఏది చెడు ఏది
తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించినపుడే ఇలాంటి దారుణాలకు కొంతలో కొంతైనా అడ్డు కట్ట వేయవచ్చని డాక్టర్ అజయ్(Dr. Ajay) అభిప్రాయ పడ్డారు. ఎంత పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా ఎంత పని ఒత్తిడి ఉన్నా రోజులో కనీసం రెండు గంటలు పిల్లల కోసం కేటాయించాలన్నారు. వారితో ప్రేమగా మాట్లాడాలని సమస్యలు ఏవైనా ఉంటే తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నారు. మంచి ఏది చెడు ఏది వివరంగా తెలియచేయలన్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉన్నా పండగుల సమయంలోనైనా అందరు కుటుంబ సభ్యులతో కనీసం రెండు మూడు రోజులైనా గడపాలని చెప్పారు. అలా చేస్తే పిల్లలకు అనుబంధాల్లో ఉండే ఆత్మీయత తెలుస్తుందన్నారు. అప్పుడే వారిలో హింసా ప్రవృత్తి కాస్తలో కాస్తయినా తగ్గుతుందని నేరాలు కూడా తగ్గుతాయని విశ్లేషించారు.

Also Read: Gadwal MRO: సామాన్యులకు రేషన్ కార్డుల తిప్పలు

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు