Bihar Crime: మేఘాలయాలో జరిగిన హనీమూన్ మర్డర్ కేసు (Honeymoon Muder Case) దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే మర్చిపోకముందే తాజాగా బిహార్ లో అచ్చం అదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఓ భార్య ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేయించింది. 55 ఏళ్ల వ్యక్తితో రిలేషన్ పెట్టుకున్న ఆమె.. అడ్డుగా ఉన్న 25 ఏళ్ల భర్తను దారుణంగా లేపేసింది. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే..
బిహార్ లోని ఔరంగాబాద్ కు చెందిన ప్రియాంషు (25), గుంజా దేవి (20)ని వివాహం చేసుకున్నాడు. 45 రోజుల క్రితం కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగం వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే తాజాగా ప్రియాంషు తుపాకి కాల్పుల్లో మరణించడం అనుమానస్పదంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ చేపట్టగా సంచలన నిజాలు వెలుగుచూశాయి. మామ జీవన్ సింగ్ (55) తో కలిసి గుంజాదేవి తన భర్తను హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. ఇందుకు కారణమైన ఇద్దరు షూటర్లను కూడా అరెస్ట్ చేశారు.
పెళ్లికి ముందే మామతో ఎఫైర్
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మామ జీవన్ సింగ్ కు గుంజా దేవితో చాలా కాలంగా ప్రేమయాణం నడుస్తోంది. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ వయసుల మధ్య వ్యత్యాసం ఉండటంతో కుటుంబ సభ్యులు ఇందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో నబీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్వాన్ గ్రామానికి చెందిన ప్రియాంషు (Priyanshu)తో ఆమెకు బలవంతంగా వివాహం జరిపించారు. ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేని గుంజాదేవి.. తన భర్తను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడు జీవన్ సింగ్ తో కలిసి హత్యకు కుట్ర పన్నింది.
Also Read: Rajasthan Family: 8 ఏళ్ల బాలుడికి అమ్మాయి గెటప్.. కట్ చేస్తే శవాలుగా తేలిన ఫ్యామిలీ!
హత్య ఎలా చేశారంటే?
జూన్ 25న తన సోదరిని కలిసేందుకు ప్రియాంషు వెళ్లడంతో ఇదే సరైన సమయమని జీవన్, గుంజా దేవి భావించారు. ఈ క్రమంలో సోదరిని కలిసి తిరిగి రైలులో నవీ నగర్ స్టేషన్ కు ప్రియాంషు చేరుకున్నాడు. అప్పుడు గుంజా దేవికి ఫోన్ చేసిన అతడు.. తనను తీసుకెళ్లడానికి బైక్ పై ఎవరినైనా పంపమని కోరినట్లు ఎస్పీ అమ్రిష్ రాహుల్ తెలిపారు. ఈ నేపథ్యంలో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తున్న ప్రియాంషును ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపినట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే భార్య గుంజా దేవి ఇంటి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసుల అనుమానం ఆమె పైకి మళ్లిందని అన్నారు. దేవి కాల్ రికార్డ్స్ ను పరిశీలించగా ఆమె తన మామ జీవన్ సింగ్ తో పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్లు తెలిసిందని చెప్పారు. అతడి గురించి ఆరా తీయగా జీవన్ సింగ్ కాల్పులు జరిపిన వారితో నిరంతం టచ్ లో ఉండటాన్ని గుర్తించినట్లు వివరించారు. దేవీ, జీవన్ సహా కాల్పులకు తెగబడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ అమ్రిష్ రాహుల్ వివరించారు.