Rajasthan Family: రాజస్థాన్ లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆత్మహత్యకు ముందు తన బిడ్డ రామ్ దేవ్ ను అమ్మాయిలాగా తల్లి ముస్తాబు చేయడం ఆసక్తికరంగా మారింది. 8 ఏళ్ల బిడ్డకు బాలిక బట్టలు వేసి కళ్లకు కాటుక పెట్టి తన ఆభరణాలు బిడ్డకు ధరించిన ఫొటో ఒకటి బయటకు రావడం తీవ్ర చర్చకు తావిస్తోంది. అయితే కుటుంబంలోని వారంతా ఇంటికి సమీపంలోని వాటర్ ట్యాంక్ లో దూకి ప్రాణాలు విడిచినట్లు పోలీసులు గుర్తించారు.
అసలేం జరిగిందంటే?
రాజస్థాన్ బర్మార్ ప్రాంతానికి చెందిన శివలాల్ మేఘ్వాల్ (35), కవిత (32) భార్య భర్తలు. వారికి భజ్ రంగ్ (9), రామ్ దేవ్ (8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాజం దృష్టిలో ఎప్పుడు సంతోషంగా కనిపించే ఈ కుటుంబం.. మంగళవారం (జులై 1) అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వారి నివాసానికి 20 మీటర్ల దూరంలో ఉన్న నీటి ట్యాంక్ లో మృతదేహాలు బయటపడటం స్థానికంగా తీవ్ర భయాందోళనకు దారి తీశాయి. బంధువుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సూసైడ్ నోట్ లభ్యం
కుటుంబం మెుత్తం ఆత్మహత్య చేసుకోవడంపై డీఎస్పీ మనారామ్ గార్గ్ స్పందించారు. మంగళవారం సాయంత్రం శివలాల్ మేఘ్వాల్ (Shivlal Meghwal) ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మరుసటి రోజు తెల్లవారుజామున వారి మృతదేహాలను గుర్తించడంతో బంధువుల సమక్షంలో వాటిని బయటకు తీసినట్లు చెప్పారు. మృతుల ఇంట్లో తనిఖీ చేయగా సూసైడ్ నోట్ దొరికిందని చెప్పారు. తమ ఆత్మహత్యకు ముగ్గురు వ్యక్తులు కారణమని మృతుడు శివరాల్ రాసినట్లు చెప్పారు. అందులో అతడి సోదరుడు కూడా ఉన్నారని స్పష్టం చేశారు. తమ నివాసం ముందే అంత్యక్రియలు నిర్వహించాలని శివలాల్ కోరుకున్నట్లు డీఎస్పీ వివరించారు.
Also Read: Cordelia Cruise Ship: విశాఖకు లగ్జరీ నౌక.. ప్రత్యేకతలు తెలిస్తే.. వెంటనే ఎక్కెస్తారు..!
దాని వల్లే ఆత్మహత్య!
అయితే శివలాల్ కు వారసత్వంగా వచ్చిన ఉమ్మడి భూమి ఉందని పోలీసులు తెలిపారు. ఆ స్థలంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చిన నిధులతో ఇల్లు కట్టుకోవాలని అతడు భావించినట్లు చెప్పారు. కానీ ఇందుకు శివలాల్ సోదరుడుతో పాటు తల్లి అంగీకరించలేదని చెప్పారు. ఈ విషయమై వారి మధ్య తరుచూ గొడవలు జరిగాయని అన్నారు. ఈ క్రమంలో శివలాల్ అతడి కుటుంబం తీవ్ర ఒత్తిడికి గురయ్యారని చెప్పుకొచ్చారు. సొంతింటి వారే నిరంతరం వేధింపులకు దిగడంతో కుటుంబంతో సహా శివలాల్ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు. అయితే చనిపోవడానికి ముందు తన బిడ్డ రామ్ దేవ్ ను తల్లి బాలిక వేషంలో ఎందుకు ముస్తాబు చేసిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.