Cordelia Cruise Ship: విశాఖ సాగర తీరం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ సిద్ధమైన తర్వాత తొలిసారి ఒక భారీ అంతర్జాతీయ టూరిజం నౌక కార్డేలియా క్రూయిజ్ (Cordelia Cruise).. నగరానికి విచ్చేసింది. కేంద్ర మంత్రి నౌకయాన మంత్రి సర్బానంద సోనోవాల్ వర్చువల్ గా, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ప్రత్యక్షంగా జెండా ఊపి నౌక పర్యాటకాన్ని ప్రారంభించారు. సీఎం చంద్రబాబు సైతం ఈ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారు. అయితే విశాఖకు వచ్చిన ఆ భారీ విహార నౌక ప్రత్యేకతలు ఏంటీ అన్న చర్చ జరుగుతోంది. అందులో ప్రయాణించాలంటే టికెట్ ధర ఉండొచ్చని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
నౌక ప్రత్యేకతలు ఇవే
విహార నౌక కార్డేలియా క్రూయిజ్ (Cordelia Cruise).. జులై 2న విశాఖపట్నం పోర్ట్ కు ప్రయాణికులతో చేరుకుంది. నౌక ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇందులో 796 క్యాబిన్లు ఉన్నాయి. స్టేట్ రూమ్, ఓషన్ వ్యూ కేబిన్లు, బాల్కనీ కేబిన్లు, సూట్లు, ఒక ఛైర్మన్ సూట్ సైతం అందుబాటులో ఉంది. కార్డేలియా క్రూయిజ్ ఒకేసారి 1100 మంది ప్రయాణికులను మోసుకెళ్లగలదు. అంతేకాదు విలాసవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు అత్యాధునిక సౌకర్యాలు, వినోద కార్యక్రమాలు, వెరైటీ ఫుడ్స్ నౌకలో అందుబాటులో ఉంచారు.
టికెట్ ధర ఎంతంటే?
కార్డేలియా నౌక విశాఖ పట్నం నుంచి చెన్నై, పుదుచ్చేరిల మధ్య ప్రయాణిస్తుంది. ఈ నెల 2, 9, 16 తేదీల్లో మూడు సర్వీసులు నడపనున్నారు. సముద్రంలో మంచి విహారాన్ని కోరుకునే వారికి కార్డేలియా క్రూయిజ్ చక్కటి ఎంపిక కాగలదు. అయితే నౌకలో ప్రయాణించడం చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుంది. ఇందులో ప్రయాణానికి ఇద్దరు వ్యక్తులు దాదాపు రూ. 50,000-1,90,000 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. చిన్నారులకు అయితే కొంతమేర ఛార్జీలో కొంతమేర సడలింపు ఉండే అవకాశముంది.
పర్యాటర రంగ అభివృద్ధే లక్ష్యం
విశాఖలో పర్యటానికి అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భారీ విహార నౌక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో క్రూయిజ్ టూరిజంని ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర పర్యాటక రంగాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బుధవారం నౌక విహారాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రూయిజ్ టర్మినల్ ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొనడం గమనార్హం.
Also Read: Harish Rao: అసెంబ్లీలో బనకచర్లపై చర్చకు సిద్ధం.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్!
అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్
అంతర్జాతీయ నౌకా పర్యాటకానికి విశాఖను ఒక మజిలీగా మార్చే లక్ష్యంతో.. తీరంలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఇందుకోసం రూ.80 కోట్లు ఖర్చు చేసింది. ఇటీవల ఈ టెర్మిలన్ ప్రారంభించడం విశేషం. సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ (Port-based Economy)ను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని సాధించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ సుందరమైన సముద్ర తీరం ఉన్న నేపథ్యంలో పర్యాటక నౌకలను ఉపయోగించుకొని పర్యాటక ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. మెుత్తంగా కార్డేలియా క్రూయిజ్ నౌక ప్రారంభం విశాఖను అంతర్జాతీయ నౌకా పర్యాటక కేంద్రంగా మార్చడంలో కీలకమైన ముందడుగుగా చెప్పవచ్చు.