KTR on Congress: బకాసురుడితో పోటీ పడుతూ తెలంగాణ భూముల్ని కాంగ్రెస్(Congress) నేతలు బుక్కపడుతున్నారని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రంగారెడ్డి జిల్లా(Ranga Reddy) మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ రైతులకు పరిహారంగా కేసీఆర్(KCR) ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాలను కాంగ్రెస్ నేతలు బలవంతంగా తమ పేరుతో రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని విమర్శించారు. ఎక్స్ వేదికగా మండిపడ్డారు. పంచభూతాలను కూడా దోచుకునే కాంగ్రెస్ నేతలు, రాష్ట్రాభివృద్ది కోసం భూములు ఇచ్చిన రైతన్నలను దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దుచేసి, భూములను తిరిగి రైతులకే ఇస్తామంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడా విషయాన్నే మరిచిపోయిందన్నారు.
స్థలాలను అప్పగించే ప్రక్రియ వాయిదా
19,400 ఎకరాల్లో గ్రీన్ ఫార్మా సిటీ(Green Pharma City) ఏర్పాటు చేయాలన్న కేసీఆర్(KCR) సత్సంకల్పానికి మద్దతుగా భూములు ఇచ్చిన రైతులకు తమ ప్రభుత్వం మెరుగైన నష్టపరిహారం ఇచ్చిందన్నారు. పట్టా భూమికి ఎకరాకు 16.5 లక్షలు, అసైన్డ్ భూమి ఎకరాకు 8.5 లక్షలు పరిహారం ఇవ్వడంతో పాటు నిర్వాసితులకు కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో 1400 ఎకరాల భూమిని కేటాయించి, దాదాపు 560 ఎకరాల్లో భారీ లేఅవుట్‌ను రూపొందించిందని గుర్తుచేశారు. రైతులు ఇచ్చిన ఎకరా భూమికి బదులుగా అభివృద్ధి చేసిన 121 చదరపు గజాల ఇంటి స్థలాన్ని పరిహారంగా ప్రకటించిందన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో వారికి ఆ స్థలాలను అప్పగించే ప్రక్రియ వాయిదా పడిందని, ఆ భూములను కొల్లగొట్టే ఉద్దేశ్యంతోనే రేవంత్(Revanth) సర్కార్ ఏడాదిన్నరగా పొజిషన్ ఇవ్వడంలేదన్నారు. ఇంతేకాదు ఆ లే అవుట్‌లో నుంచే 330 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి అలైన్‌మెంట్‌ను ఖరారు చేసి రైతుల నోట్లో రేవంత్ సర్కార్ మట్టికొట్టిందని ఆరోపించారు.
Also Read: Ponnam Prabhakar: ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ధ్యేయం.. మంత్రి పొన్నం ప్రభాకర్
మార్కెట్లో చదరపు గజం రూ.30 వేలు
అధికారం ఉందన్న అహంకారంతో తెలంగాణ(Telangana) ప్రజలను నిలువు దోపిడి చేస్తున్న కాంగ్రెస్(Congress) నేతలకు, ఫార్మాసిటీ నిర్వాసితులకు పరిహారంగా ఇచ్చిన భూములు ఫలహారంగా మారాయన్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు రైతులను భయపెట్టి ఆ భూములను అడ్డికి పావుసేరుకు కొనుక్కుంటున్నారని ఆరోపించారు. బహిరంగ మార్కెట్లో చదరపు గజం రూ.30 వేలు ఉంటే కాంగ్రెస్ నేతలు రైతులను బెదిరించి రూ.4- 5 వేలకే కొంటున్నారన్నారు. ఎన్నికల్లో గెలవగానే భూములు తిరిగి ఇస్తామన్న రేవంత్ సర్కార్, వారికి హక్కుగా రావాల్సిన ఇంటి స్థలాలను కాంగ్రెస్ నేతలు కొల్లగొడుతుంటే చూస్తూ ఊరుకుంటుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంగ్రెస్ నేతలు చేసుకుంటున్న అక్రమ రిజిస్ట్రేషన్లపై చర్యలు తీసుకుని, రైతులకు భూములను అప్పగించాలని డిమాండ్ చేశారు.
Also Read: Hydraa: పరికరాలతో రంగంలోకి దిగిన మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు!