Man Married Thrice: ప్రస్తుత కాలంలో పెళ్లి అనేది మహా కష్టంగా మారిపోయింది. పెళ్లి చేసుకునేందుకు యువతులు దొరక్క.. యువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక లైఫ్ అంతా సింగిల్ గా బతికాల్సిందేనా అంటూ ఆందోళనకు గురవుతున్నారు. అలాంటిది ఓ వ్యక్తి.. మూడేళ్ల వ్యవధిలో ఏకంగా ముగ్గురు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లాడి తండ్రి సైతం అయ్యాడు. అంతటితో ఆగకుండా భార్యలపై వరకట్నం, శారీరక వేధింపులకు సైతం పాల్పడ్డాడు. భార్యలు బిగ్ షాక్ ఇవ్వడంతో ప్రస్తుతం కటకటాలపాలయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే..
బిహార్ మీర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరూప్ సమైల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీవాన్ జిల్లా గోరియా కోఠీకి చెందిన 24 ఏళ్ల యువతి గుడియా కుమారి (రెండో భార్య) తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌గంజ్ నివాసి పింటూ బర్న్ వాల్ తో ఆమెకు 2024 ఏప్రిల్ లో వివాహం జరిగింది. అయితే అతడికి ముందే వివాహం జరిగిందన్న విషయం తనకు తెలియదని ఆరోపించింది. పింటూకి గతంలోనే వివాహమైన విషయం పెళ్లైన తర్వాత తెలిసి ఒక్కసారిగా షాక్ గురైనట్లు గుడియా తెలిపారు. అయితే తనకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళను పింటూ పెళ్లి చేసుకున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పింటూతో పాటు అతడి తల్లి, అక్కపై మీర్ గంజ్ పోలీసు స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
తెరపైకి మెుదటి భార్య..
పింటూపై కేసు నమోదైన విషయం తెలిసి మెుదటి భార్య కూడా తెరపైకి వచ్చారు. 2022లో ఖుష్బూ కుమారి అనే మహిళను పింటూ మెుదటి వివాహం చేసుకున్నాడు. అప్పట్లో తన తండ్రి 20 గ్రాముల బంగారం, కొన్ని తులాల వెండి, రూ.3 లక్షల నగదు ఇచ్చారని ఖుష్బూ కుమారి ఆరోపించారు. అయినప్పటికీ మరో రూ.5 లక్షలు కావాలని, కారు కొనిపెట్టేలా పుట్టింటివారిపై ఒత్తిడి తీసుకురావాలని తనను పింటూ వేధించినట్లు ఆమె వాపోయారు. దీనిపై మీర్ గంజ్ పోలీసు స్టేషన్ లో ఆమె తాజాగా ఫిర్యాదు కూడా చేశారు. అంతేకాకుండా పెళ్లైన తొలి రాత్రి తనను వివస్త్రను చేసి వీడియోలు కూడా తీశాడని ఖుష్బూ ఆరోపించింది.
మూడో భార్య ఎవరంటే..
ఇక మూడో భార్య విషయానికి వస్తే.. సారణ్ జిల్లాకు చెందిన ఓ యువతిని పింటూ వివాహం చేసుకున్నట్లు ఖుష్బూ తెలిపారు. వారికి ఒక బిడ్డ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే పింటూకు ముందే రెండు పెళ్లిళ్లు జరిగిన విషయం ఆమెకు తెలియదని ఖుష్బూ స్పష్టం చేశారు. కాగా, ఇద్దరు భార్యలు ఒకేసారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పింటూ బర్న్ వాల్ ను మీర్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరకట్న వేధింపులు, విడాకులు తీసుకోకుండా వివాహం చేసుకోవడం వంటి ఆరోపణలపై అతడ్ని కటకటాల్లోకి పంపారు.
Also Read: Kamareddy district: భార్యపై వేధింపులు.. కామాంధుడ్ని చెప్పుతో కొడుతూ.. రోడ్డుపై ఊరేగించిన భర్త
పెళ్లిళ్లపై భర్త వింత వాదన
అయితే ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకోవడంపై పింటూ స్పందించాడు. తాను కోరుకున్న గుణాలు ఇద్దరి భార్యల్లో దొరకలేదని అందుకే మూడో వివాహం చేసుకున్నాని పేర్కొన్నాడు. అయితే తాను వరకట్నం ఏదీ కూడా తీసుకోలేదని చెప్పాడు. తనపై ఇద్దరు భార్యలు పూర్తిగా అబద్దాలు చెబుతున్నారని వాదించాడు. అంతేకాదు ఇద్దరు భార్యలు కలిసి తనపై కత్తితో దాడి చేశారని పింటూ ఆరోపించాడు. రెండో పెళ్లి చేసుకునే ముందు మెుదటి భార్యకు ఆ సమాచారం చేరవేశానని చెప్పుకొచ్చాడు.

