Robbery Solved: రూ.40 లక్షలు లూటీ చేసిన వైనం
సూత్రధారితో పాటు నిందితుల అరెస్ట్
34.66 లక్షల రూపాయలు స్వాధీనం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన భవానీనగర్ దోపిడీ కేసు మిస్టరీని (Robbery Solved) పోలీసులు చేధించారు. ఈ నేరానికి పాల్పడ్డ నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.34.66 లక్షల నగదు, ఒక కత్తి, 5 మొబైల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దోపిడీలో ప్రధాన సూత్రధారి ఉన్న వ్యక్తి, బాధితుడికి సన్నిహిత మిత్రుడు అని తేలింది. మీర్ చౌక్ సబ్ డివిజన్ ఏసీపీ శ్యాం సుందర్ ఈ మేరకు శుక్రవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఇళ్లు కొందామని…
గత నెల 30న తెల్లవారుజాము సమయంలో తలాబ్ కట్ట నివాసి మహ్మద్ సుల్తాన్ ఇంట్లోకి దుండగులు మాస్కులు ధరించి చొరబడ్డారు. కత్తితో బెదిరించి 40 లక్షల రూపాయల నగదు, సెల్‌ఫోన్ దోచుకుని ఉడాయించిన విషయం తెలిసిందే. కొత్త ఇళ్లు కొనుక్కోవటానికి జమ చేసిన డబ్బును దుండగులు లూటీ చేసి పారిపోయారంటూ బాధితుడు ఫిర్యాదు చేయగా, భవానీనగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
Read Also- MD Amir Pasha: ఎంపీ ఈటల రాజేందర్ వీరాభిమాని గుండెపోటుతో మృతి..!
టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి…
స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ దోపిడీని సౌత్ జోన్ డీసీపీ కిరణ్ ప్రభాకర్ ఛాలెంజ్‌గా తీసున్నారు. ఈ క్రమంలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాస రావు ఆధ్వర్యంలో ఇన్స్‌పెక్టర్లు నర్సింహా నాయక్, ఆదిరెడ్డి, నయీముద్దీన్, పాపయ్య, సబ్‌ఇన్స్‌పెక్టర్ శ్రీకాంత్, తదితరులతో 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నిందితుల కోసం వేట మొదలు పెట్టారు. వేర్వేరు కోణాల్లో విచారణ ప్రారంభించి దోపిడీ జరిగిన మహ్మద్ సుల్తాన్ ఇంటి పరిసరాలతో పాటు అక్కడికి వెళ్లే దారుల్లోని పలు సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించారు. వీటిని విశ్లేషించటం ద్వారా ఓ టూ వీలర్ నెంబర్ తెలుసుకోగలిగారు. దాంతోపాటు ఒక పెట్రోల్ బంకులో టూ వీలర్‌ను నడిపిన వ్యక్తులు పెట్రోల్ పోయించుకుని యూపీఐ ద్వారా డబ్బు చెల్లించినట్టు నిర్ధారించుకున్నారు. ఈ క్లూస్‌తో నేరానికి పాల్పడ్డ తలాబ్ కట్టకు చెందిన సయ్యద్ ఇర్ఫాన్ (30), ముదస్సిర్ అలాహీ (19), మహ్మద్ జాహిద్ (37), మహ్మద్ అబ్దుల్ రహమాన్ (25)లను గుర్తించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also- TG Global Summit: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్‌లో కీలక మార్పులు
బాధితుడి స్నేహితుడే సూత్రధారి…
విచారణలో సూత్రధారి అయిన మహ్మద్ జాహిద్.. బాధితుడైన మహ్మద్ సుల్తాన్‌కు స్నేహితుడని వెల్లడైంది. ఇటీవలే కొత్త ఇళ్లు కొనుక్కుందామని నిర్ణయించుకున్న మహ్మద్ సుల్తాన్, మొత్తం 40 లక్షల రూపాయలు జమ చేసి ఇంట్లో దాచి పెట్టాడు. ఈ విషయాన్ని మహ్మద్ జాహిద్‌తో చెప్పాడు. అప్పటికే అన్నిరకాల దుర్వసనాలకు బానిసైన మహ్మద్ జాహిద్, ఆ డబ్బును దోచుకోవాలని పథకం వేశాడు. మిగతా ముగ్గురు సహచరులతో కలిసి వేసుకున్న పథకం ప్రకారం నగదును లూటీ చేశాడు. పక్కగా ఆధారాలు సేకరించిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో సయ్యద్ ఇర్ఫాన్‌కు నేరచరిత్ర ఉన్నట్టుగా ఏసీపీ శ్యాం సుందర్ తెలిపారు. 5 రోజుల్లోనే కేసులోని మిస్టరీని ఛేధించి నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు.

