Crime News: సమాజంలో అమ్మాయిల వేధింపులు రోజు రోజుకు ఎక్కువుతున్నాయి. ఇష్టమొచ్చిన సమయంలో మెసేజ్ లు చేస్తూ, వారిని విసిగించడం అబ్బాయిలకు ఒక అలవాటులాగా మారింది. ఇప్పుడు అలాంటి ఘటనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు పంపి టీవీ నటిని లైంగికంగా వేధించిన ఘటన బయటపడింది. ఈ ఘటనలో పోలీసులు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, అరెస్టైన వ్యక్తి నవీన్ కె. మోన్. అతను వైట్‌ఫీల్డ్‌లోని టెంపిల్టన్ అండ్ పార్ట్నర్ కంపెనీలో డెలివరీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ కేసు అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది.
41 ఏళ్ల వయసున్న బాధితురాలు కర్ణాటక, తెలుగు టెలివిజన్ సీరియల్స్‌లో నటించింది. ఆమె తన భర్త, తల్లి, కుమార్తెతో కలిసి అన్నపూర్ణేశ్వరి నగర్‌లో నివసిస్తున్నారు. నటి ఇచ్చిన ఫిర్యాదులో ఆమెకు నవీన్ నుంచి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది కానీ ఆమె అంగీకరించలేదని తెలిపింది. దీని తరువాత అతను ప్రతిరోజూ మెసెంజర్‌లో అసభ్య సందేశాలు పంపడం మొదలుపెట్టాడు. నటి అనేకసార్లు హెచ్చరించినప్పటికీ, అతను తన ప్రవర్తనలో మార్పు చూపలేదని తెలిపారు.
తర్వాత నటి అతని అకౌంట్ ను బ్లాక్ చేయగా, అతను కొత్త అకౌంట్లు క్రియోట్ చేసి మళ్ళీ తిరిగి అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు పంపడం కొనసాగించాడు. ఈ క్రమంలోనే నవంబర్ 1 న నటి అతనికి నాగర్భావి ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో కలుసుకోవాలని చెప్పింది. అక్కడ కలిసినప్పుడు అతనిని మరోసారి హెచ్చరించింది. అయినా కూడా అతను వేధింపులను ఆపకపోవడంతో, ఆమె పోలీసులను ఆశ్రయించారు. నటి ఫిర్యాదు మేరకు అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita) లో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇటీవల బెంగళూరులో జరిగిన రేణుకాస్వామి హత్య కేసులో కూడా కర్ణాటక స్టార్ దర్శన్, అతని భాగస్వామి పవిత్ర గౌడ, ఇతర 15 మంది ఒక అసభ్య సందేశం కారణంగా రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో అరెస్టయ్యారు.
