Crime News: దొంగతనాలు చేయటమే వృత్తిగా చేసుకున్న గ్యాంగ్‌ను బాలానగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు బైకులు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ జోన్ డీసీపీ సురేశ్ కుమార్ మంగళవారం మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. మణికొండ అల్లాపురి టౌన్ షిప్ వాస్తవ్యుడు, ప్రైవేట్ ఉద్యోగి సునీల్ కుమార్ గత నెల 19న కారులో దుండిగల్‌కు బయల్దేరాడు.
Also Read: Chiranjeevi: గ్లోబల్ సమ్మిట్‌కు పిలవడానికి మంత్రులు వచ్చినప్పుడు నేను ఏ పొజిషన్‌లో ఉన్నానో తెలుసా?
కారును రోడ్డు పక్కగా ఆపి..
దుండిగల్ మరికొద్ది దూరంలో ఉందనగా ఫోన్ కాల్ రావడంతో కారును రోడ్డు పక్కగా ఆపి మాట్లాడుతున్నాడు. అదే సమయంలో ఓ దుండగుడు బలవంతంగా కారులోకి వచ్చి కూర్చున్నాడు. కత్తి చూపించి డబ్బు ఇవ్వమని డిమాండ్ చేయగా, సునీల్ వద్ద డబ్బు లేకపోవడంతో అతని మెడలో ఉన్న బంగారు గొలుసును తీసుకుని ఉడాయించాడు. ఈ మేరకు ఫిర్యాదు అందగా దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ నాగేశ్వరరావు పర్యవేక్షణలో సీసీఎస్ సీఐ రవికుమార్ విచారణ జరిపారు. పక్కా ఆధారాలు సేకరించి జగద్గిరిగుట్ట నివాసి గుర్దార్ సింగ్ ఎలియాస్ గురూ సింగ్ (24)తో పాటు గుంటూరు జిల్లా పల్నాడుకు చెందిన షేక్ నాగుల్ మీరా (30), కోట అఖిల్ కుమార్ (23)లను అరెస్ట్ చేశారు. విచారణలో ముగ్గురు కలిసి వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో 17 నేరాలకు పాల్పడినట్టుగా వెల్లడైందని డీసీపీ సురేశ్ కుమార్ తెలిపారు. మరోవైపు, రూ.4 లక్షల నగదును తస్కరించి తప్పించుకుని తిరుగుతున్న దొంగలను కూడా బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: Tirumala Scam: తిరుమలలో మరో భారీ మోసం.. పట్టు పేరుతో పాలిస్టర్ సరఫరా.. రూ.54 కోట్లు స్వాహా!

