Tirumala Scam: తిరుమలలో మరో భారీ మోసం వెలుగు చూసింది. శ్రీవారి సన్నిధిలో గత పదేళ్లుగా జరుగుతున్న ఘోరమైన అవినీతి బట్టబయలు అయ్యింది. ఓ కాంట్రాక్ట్ సంస్థ పట్టు పేరుతో పాలిస్టర్ శాలువలను సరఫరా చేసిన ఉదంతం తాజాగా బయటపడింది. నగరికి చెందిన వీఆర్ఎస్ ఎక్స్ పోర్ట్ (VRS Export) సంస్థ ఈ మోసానికి పాల్పడినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఏళ్ల తరబడి జరుగుతున్న మోసంపై ఏసీబీ విచారణకు సైతం టీటీడీ ఆదేశించింది.
పట్టు ముసుగులో పాలిస్టర్ సరఫరా చేయడాన్ని టీటీడీ పాలక మండలి తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఏసీబీ విచారణ కోరుతూ తీర్మానం చేసింది. కాగా గత పదేళ్ల కాలంలో రూ.54 కోట్ల మేర శాలువ కొనుగోళ్లు జరిగినట్లు టీటీడీ విజిలెన్స్ నివేదిక పేర్కొంది. తాజాగా జరిపిన ధర్మవరం, సిల్క్ బోర్డుల నాణ్యత పరీక్షలో టీటీడీకి సప్లయి అవుతున్న శాలువాలు విఫలమయ్యాయని అధికారులు తెలిపారు. శాలువాలకు వినియోగించినది పట్టు కాదని పాలిస్టర్ అని వెల్లడైంది.
Also Read: Visakhapatnam: విశాఖలో అగ్నిప్రమాదం.. 9వ అంతస్తులోని ఫ్లాట్‌లో ఎగసిపడ్డ మంటలు
అయితే తమిళనాడులోని కంచి ఆలయానికి కూడా వీఆర్ఎస్ ఎక్స్ పోర్ట్ సంస్థ పట్టును సరఫరా చేస్తోంది. అయితే కంచికి పంపిణీ చేసిన శాలువాలు మాత్రం నాణ్యంగానే ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు.. ఏసీబీ విచారణకు సిఫార్సు చేశారు. తిరుమలలోని రంగనాయకుల మండపంలో వీఐపీలు, దాతలకు బహుకరించే శాలువాల్లో ఈ మోసం జరిగినట్లు విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. టీటీడీ సిఫార్సును ఏపీ ప్రభుత్వం ఆమోదిస్తే వెంటనే ఏసీబీ విచారణ ప్రారంభం కానుంది.

