Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన 15ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఊహించని మలుపు తీసుకుంది. బాధిత బాలికను స్థానిక శిశు సంక్షేమ సంఘం (Child Welfare Committee – CWC) అధికారులు.. నిందితుడి ఇంటికి పంపించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ ఆమెపై మరోమారు లైంగిక దాడి జరిగినట్లు తేలింది. దీంతో పోలీసులు CWC చైర్మన్, సభ్యులు, సీనియర్ అధికారులతో సహా 10 మందిపై కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే..
2025 జనవరి 16న పన్నా జిల్లాలోని తన గ్రామం నుంచి పాఠశాలకు వెళ్లిన బాలిక కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 17న బాలికను గురుగ్రామ్ (హర్యానా)లోని నిందితుడి ఇంట్లో గుర్తించారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. అనంతరం కేసు పన్నా కోట్వాలి పోలీస్‌స్టేషన్ నుంచి జుజ్హర్ నగర్ పోలీస్‌స్టేషన్ (ఛత్తర్‌పూర్ జిల్లా)కు బదిలీ అయింది.
CWC వివాదాస్పద నిర్ణయం
ఈ నేపథ్యంలో బాలిక సంరక్షణ బాధ్యతను సీడబ్ల్యూసీ అధికారులకు అప్పగించారు. అయితే వారు తమ బాధ్యతలను విస్మరించి.. నిందితుడి వదిన (అదే సమయంలో బాధితురాలి బంధువు) ఇంటికి పంపారు. ఈ క్రమంలో జైలు నుంచి బయటకొచ్చిన నిందితుడు.. తన ఇంట్లోనే ఉన్న బాలికపై మరోమారు అత్యాచారానికి ఒడిగట్టాడు.
Also Read: Viral video: అయ్యబాబోయ్.. దిల్లీ నడిబొడ్డున జలపాతం.. అది కూడా మెట్రో స్టేషన్‌లో..
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో
దీంతో బాలిక కుటుంబ సభ్యులు.. పన్నా కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన సీడబ్ల్యూసీ అధికారులు.. తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఏప్రిల్ 29న బాలికను తిరికి వన్ స్టాప్ సెంటర్ కు తరలించారు. అక్కడ కౌన్సెలింగ్ చేస్తుండగా తనపై నిందితుడు మళ్లీ లైంగిక దాడి చేసినట్లు బాలిక స్పష్టం చేసింది. అయితే ఈ విషయాన్ని శిశు సంక్షేమ శాఖ అధికారి దాచిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.
Also Read: Hyderabad: గణేష్ నిమజ్జనం ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ఆ మార్గాలు క్లోజ్.. అటు వెళ్లారో బుక్కైపోతారు!
కుట్ర బహిర్గతం
స్థానిక మీడియా దృష్టికి ఈ విషయం వెళ్లడంతో బాలికపై మరోమారు అత్యాచారం ఘటన తీవ్ర దుమారం రేపింది. దీంతో ఏఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు బృందం ఏర్పాటైంది. వారి దర్యాప్తులో సీడబ్ల్యూసీ అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. ‘బాధిత బాలికను నిందితుడి ఇంటికి పంపిన వారు.. ఈ విషయాన్ని దాచిపెట్టిన వారిపై కేసులు నమోదు చేశాం. జిల్లా ప్రోగ్రామ్ అధికారి, వన్‌స్టాప్ సెంటర్ సిబ్బంది కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినట్లు కూడా విచారణలో బయటపడింది’ అని దర్యాప్తు అధికారి తెలిపారు.