Aaraa Mastan: హైదరాబాద్‌లో విలువైన భూమిని కబ్జా పెట్టిన ఆరా మస్తాన్ ఆగడాలపై ‘స్వేచ్ఛ’ వరుస కథనాలు ఇస్తున్నది. బాధిత కుటుంబం పడుతున్న ఇబ్బందులను వివరిస్తున్నది. దీంతో రెచ్చిపోతున్న మస్తాన్ గ్యాంగ్ బాధితులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నది. ఈ క్రమంలో వారు భయాందోళనకు గురవుతున్నారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
సివిల్ డ్రెస్‌లో పోలీసుల తనిఖీలు
మెట్టుగూడలో రూ.50 కోట్ల విలువైన భూమిని చాలా తక్కువ మొత్తంలో ఖర్చు చేసి లాభాలతో అమ్ముకుని బయటపడాలని ఆరా మస్తాన్ ప్లాన్ చేసుకున్నాడు. తనకు పొజిషన్ ఉందంటూ పోలీసులతో చక్రం తిప్పుతున్నాడు. ఈ కబ్జా వ్యవహారంలో పోలీసులే కీలకంగా మారుతున్నారు. ఈస్ట్ జోన్ పోలీసులు తమను వేధిస్తున్నారంటూ బాధిత వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున సివిల్ డ్రెస్‌లో పోలీసులు వచ్చి తమ ఇంటిలో సోదాలు జరిపినట్టు తెలిపారు. తమ కొడుకును అప్పగించాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ వాపోయారు.
అసలీ వివాదం ఏంటి?
హైదరాబాద్ మెట్టుగూడలోని సర్వే నెంబర్ 733లో ఉన్న 5717 గజాల స్థలం కోర్టు వివాదంలో ఉన్నది. ఈ భూమి 60 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉంది అంటూ పొజిషన్‌లో ఉన్న రమేష్ చెబుతున్నారు. చార్మినార్ పాట్రీ సిరామిక్ కంపెనీ యజమాని నర్సి పాంచ్ నుండి రమేష్ తండ్రి కుమార స్వామి డబ్బు చెల్లించి కొనుగోలు చేశారు. అందుకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయి. వాటి ఆధారంగానే కుమార స్వామి కుమారుడు రమేష్, సోదరులపై ఆ భూమి రిజిస్ట్రేషన్ అయ్యింది. మధ్యలో మెహతా కుటుంబం ఎంటర్ కాగా కోర్టులో వివాదాలు నడుస్తున్నాయి. జితేందర్ మెహతా కుటుంబం నర్సి పాంచ్ నుండి సెటిల్ చేసుకుంది. అనంతరం హైకోర్టులో ఈ భూమికి సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ ఆదేశాలు వచ్చాయి.
Read Also- Weight Loss Tips: బరువు తగ్గాలా.. జిమ్, డైట్ అక్కర్లేదు.. ఈ పండ్లు తింటే చాలు!
ఆరా మస్తాన్ ఎంట్రీ
మెహతా కుటుంబం వారసుల నుండి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి అక్రమంగా ఆరా మస్తాన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులను మేనేజ్ చేసి 2024 నవంబర్‌లో రిజిస్ట్రేషన్(3383/2024, 3384/2024) చేసుకుని పొజిషన్‌లో ఉన్న తమను పంపించే కుట్ర చేస్తున్నాడని మండిపడుతున్నారు. ఈ భూమిని కాజేయాలని వ్యాపారి శ్రీ చైతన్య విస్టా స్కూల్స్ అధినేత మల్లంపాటి శ్రీధర్‌తో కలిసి ప్లాన్ చేశాడని వివరించారు. తమ భూమిలో నివసిస్తున్న వాచ్‌మెన్ కుటుంబంపై దాడి చేసిన ఆరా మస్తాన్ మనుషులు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని చెబుతున్నారు. 20, 30 మందితో కలిసి దౌర్జన్యంగా బెదిరించి భయబ్రాంతులకు గురి చేశరని వివరించారు.
పోలీసులకు ఫిర్యాదు.. కానీ..
దాడిపై చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. కానీ, పోలీసులు మాత్రం సోమవారం తెల్లవారుజామున సివిల్ డ్రెస్‌లో తమ ఇంటికి వచ్చి సోదాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కొడుకు గురించి ఆరా తీశారని, అక్రమ కేసులతో వేధింపులకు గురి చేసే కుట్రలు జరుగుతున్నాయని వాపోయారు. గతంలో ఈ భూమి విషయంలో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వద్దకు ఆరా మస్తాన్ తమను పిలిపించాడని, ఆయ సమక్షంలో సెటిల్ చేసుకోవాలని బెదిరించాడని చెప్పారు. పోలీసులను, అధికారులను మేనేజ్ చేస్తూ తమ భూమిని ఆరా మస్తాన్, మల్లంపాటి శ్రీధర్ కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారని వాపోయారు. భూమికి సంబంధించిన వివాదాలు ఉంటే కోర్టులలో పరిష్కరించుకోవాలి కానీ, తమపై దౌర్జన్యం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ, దాడులు చేస్తూ భయాందోళనలకు గురి చేయడం సమంజసం కాదని అంటున్నారు. ఆరా మస్తాన్ నుండి అతని మనుషుల నుండి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని, పోలీస్ ఉన్నతాధికారులను బాధితులు కోరారు.
Read Also- Gadwal Surveyor Murder Case: సర్వేయర్ హత్య.. వెలుగులోకి సంచలన నిజాలు!