Medchal Crime: విద్యుద్ఘాతానికి గురై ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అత్వెల్లిలో జరిగింది. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం మేడ్చల్ మున్సిపాలిటీ అత్వెల్లికి చెందిన దుందిగళ్ల లింగం(53) ప్రైవేట్ ఎలక్ర్టిషియన్‌గా పని చేస్తున్నాడు. వెంచర్‌గా అభివృద్ధి చేస్తున్న ఆ స్థలంలో ఉన్న తాత్కాలిక నివాసాలకు కరెంట్ రాకపోవడంతో సంబంధీకులు ఫోన్ చేయడంతో శుక్రవారం ఉదయం11.30 గంటల ప్రాంతంలో అత్వెల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్న ప్రైవేట్ స్థలం వద్దకు లింగం వెళ్లాడు. మీటర్ వద్ద పరిశీలించిన అనంతరం త్రీఫేజ్ కరెంట్‌కు ఒక ఫేజ్ కరెంట్ రావడం లేదని గుర్తించి ఆ స్థలం ప్రహరీకి ఆనుకుని ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద త్రీఫేజ్ కోసం కనెక్షన్ ఇవ్వాలని పైకి ఎక్కాడు.
గతంలో తనకు విద్యుత్ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేసిన అనుభవం ఉన్న కారణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. కనెక్షన్ ఇస్తుండగా కాలుకు విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో కొద్దిసేపు గిలాగిలా కొట్టుకుని ట్రాన్స్‌ఫార్మర్ వద్దే ఒరిగిపోయాడు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ రూరల్ ఏఈ మౌలాలీ ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. ఏఈ మౌలాలీని ఘటన గురించి వివరణ కోరగా ఉదయాన్నే ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఏవో మరమ్మతు చేస్తుంటే కరెంట్ ట్రిప్పు అయిపోయిందన్నారు. తమ సిబ్బందిక వచ్చి ఫ్యూజ్ వేసి, ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎలాంటి పనులు చేయవద్దని లింగంను హెచ్చరించినట్టు చెప్పారు.
Also Read: Maoist Encounter: నంబాల ఎన్ కౌంటర్ పై.. సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలి!
అయినా ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వచ్చి లింగం విద్యుదాఘాతానికి గురయ్యాడని తెలిపారు. కాగా విషయాన్ని తెలుసుకున్న లింగం భార్య భాగ్యమ్మ, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని, కన్నీరుమున్నీరయ్యారు. లింగం విద్యుదాఘాతానికి గురి కాగానే మరమ్మతు కోసం పిలిచిన వారు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై మన్మథరావు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై ప్రాథమికంగా సమాచారాన్ని సేకరించారు.
Also Read: Hydraa Commissioner: దేవుణ్ణీ వదలని భూబకాసురులు.. ఎక్కడంటే?