Dating app Scam: ప్రస్తుత రోజుల్లో మహిళలపై లైంగిక దాడి పెరిగిపోయింది. స్త్రీలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అటు సోషల్ మీడియాలోనూ కొందరు మృగాళ్ల కారణంగా వేధింపులకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ (Hyderabad) లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు.. ఒక వృద్ధుడ్ని ట్రాప్ చేసి.. వేధించిన ఘటన అందరినీ అశ్చర్యపరుస్తోంది. దీంతో మగవారిని.. అందులోనూ ముసలివారిని కూడా వదిలిపెట్టరా? అన్న ప్రశ్నలు సమాజం నుంచి వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ కు చెందిన ఓ వృద్ధుడికి ముగ్గురు యువకులు వలపు వల విసిరారు. తొలుత ఓ లెస్బియన్ యాప్ ద్వారా ఒక యువకుడు వృద్ధుడితో చాటింగ్ చేశాడు. కొద్దిరోజుల చాటింగ్ తర్వాత అతడికి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో అమీర్ పేట్ లోని ఓ హోటల్ కు రమ్మని వృద్ధుడ్ని పిలిచాడు. శారీరకంగా దగ్గరవుదామని చెప్పి.. అతడ్ని నగ్నంగా నిలబెట్టాడు. అప్పటికే గది కిటికీల వద్ద నిలబడి ఉన్న నిందితుడి ఫ్రెండ్స్.. వృద్ధుడ్ని నగ్నంగా వీడియోలు తీశారు.
డబ్బులు డిమాండ్!
నగ్న వీడియోలు అడ్డం పెట్టుకొని వృద్దుడ్ని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో పెద్ద మెుత్తంలో డబ్బు కూడా వసూలు చేశారు. తాజాగా మళ్లీ వృద్ధుడికి ఫోన్ చేసిన యువకుల గ్యాంగ్.. రూ.20 వేలు ఇవ్వాలంటూ మళ్లీ బెదిరించారు. తన దగ్గర అంత డబ్బు లేదని వృద్ధుడు వారించినా వారు ఊరుకోలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన బాధితుడు.. వారిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: Jupally Krishna Rao: ప్రాణాలతో చెలగాటమాడొద్దు.. వారిని వదిలిపెట్టం.. మంత్రి వార్నింగ్!
నిందితులు అరెస్ట్
వృద్ధుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పంజాగుట్ట పోలీసులు.. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల్లో ఇద్దరిది మహబూబ్ నగర్ కాగా, మరొకరిది హైదరాబాద్ అని పోలీసులు తెలిపారు. గతంలో అనేక మందిని యువకుల గ్యాంగ్ ఇలాగే బెదిరించినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.