Jupally Krishna Rao: ప్రజల ప్రాణాలతో చెలగాటామాడితే ఎవ్వరినీ వదిలి పెట్టమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. బుధవారం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ, ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి కల్లు డిపోలపై నిరంతర నిఘా, పర్యవేక్షణను కొనసాగిస్తామన్నారు.
బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కల్తీ కల్లు తాగి కొందరు చనిపోవడం, పలువురు అస్వస్థతకు గురి కావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. చికిత్స పొందుతున్న వారికి ధైర్యం చెప్పిన మంత్రి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. సంఘటన జరిగిన వెంటనే ఎక్సైజ్, పోలీస్ అధికారులు వెంటనే స్పందించి బాధితులను ఆస్పత్రులకు తరలించినట్టు పేర్కొన్నారు. సకాలంలో వైద్య సహాయం అందడంతో బాధితులు కోలుకుంటున్నారని చెప్పారు. చికిత్స పొందుతున్న వారంతా ఒకే రకమైన లక్షణాలతో బాధపడుతున్నట్టు తెలిపారు.
Also Read: Buck Moon 2025: మరికాసేపట్లో అద్భుతం ఆవిష్కృతం.. చూడకుంటే బాధపడాల్సిందే!
ప్రాథమికంగా కల్తీ కల్లు కారణంగానే ఇది జరిగినట్టుగా భావిస్తున్నామన్నారు. జరిగిన సంఘటనపై ఎక్సైజ్, పోలీస్ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని పేర్కొన్నారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి కూడా తీసుకున్నట్టు తెలిపారు. కల్లు డిపోలను కూడా సీజ్ చేశారన్నారు. ఆయా డిపోల నుంచి కల్లు శాంపిళ్లను సేకరించి ఎక్సైజ్ కెమికల్ లేబొరేటరీకి పరీక్షల నిమిత్తం పంపించినట్టు చెప్పారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు కల్లు డిపోల లైసెన్సులను రద్ధు చేస్తామన్నారు.