Ram Gopal Varma: మెగా ఫ్యామిలీపై (Mega Family) వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు గుప్పించడం పరిపాటిగా మార్చుకున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మరోసారి తన నోటికి పనిచెప్పాడు. స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎదిగి టాలీవుడ్ మెగాస్టార్ హోదా దక్కించుకొని, కోట్లాది సినీ అభిమానుల మన్ననలు అందుకున్న సినీ దిగ్గజం కొణిదెల చిరంజీవితో పాటు (Konidela Chiranjeevi) దక్షిణాది సినీ దిగ్గజాలపై వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 1970, 1980 దశాబ్దాల కాలంలో బాలీవుడ్ (BollyWood) దిగ్గజం, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (Amithab Bachchan) సినిమాలను రీమేక్ చేసి దక్షిణాది సినీ ఇండస్ట్రీ ఎదిగిందని వ్యాఖ్యానించాడు. దక్షిణాదిలో కీలకమైన తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం ఈ నాలుగు భాషల సినీ ఇండస్ట్రీలపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రభావం బలంగా ఉందని వ్యాఖ్యానించాడు. అమితాబ్ సినిమాల రీమేక్ పరంపరలో దక్షిణాదిలో కొందరు సినీ స్టార్లుగా ఎదిగారని, మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదేమాదిరిగా లబ్ధి పొందారని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు, రజనీకాంత్, ఎన్టీ రామారావు, రాజకుమార్ కూడా ఇదే పంథాలో సినీ స్టార్లు అయ్యారని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు. ‘ఇండియా టీవీ షోబిజ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు.
Read this- Vishal: శుభమా అని పెళ్లికి రెడీ అవుతున్న వేళ.. విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు!
వీళ్లంతా బిగ్‌బీ పాత్రల ప్రతిరూపాలు
రజనీకాంత్, చిరంజీవి, ఎన్టీ రామారావు, రాజ్ కుమార్ వంటి దిగ్గజ నటుల సినీ కెరీర్‌ను నిర్వచించే పాత్రలలో చాలా వరకు అమితాబ్ బచ్చన్ పాపులర్ సినిమా రిమేక్‌లేనని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు. అమితాబ్ నటించిన పాత్రలే ఈ స్టార్ హీరోల ప్రతిరూపాలుగా మారాయని ఆయన అభిప్రాయపడ్డాడు. రీమేక్ సినిమాలే వారిని సాంస్కృతిక రథసారథులుగా నిలిపాయన్నాడు. క్రమంగా అభిమానులకు ఆరాధ్య దైవాలుగా ఎదిగిపోయారని వర్మ వ్యాఖ్యానించాడు. రీమేక్ సినిమాలు కేవలం కాపీలుగా మిగిలిపోలేదని, ప్రాంతీయ స్టార్లకు ఇంటి పేర్లుగా కూడా మారాయని, చివరకు అభిమానులకు ప్రత్యక్ష దైవాలుగా నిలిపేందుకు తోడ్పడ్డాయని పేర్కొన్నాడు.
Read this- Chenab Rail Bridge: ఔరా!. చీనాబ్ రైల్ బ్రిడ్జి.. అబ్బురపరిచే నిజాలు ఇవే
అమితాబ్ విరామంతో మార్పు
1990వ దశాబ్దంలో అమితాబ్ బచ్చన్ ఐదు సంవత్సరాల విరామం తీసుకున్నారని, ఆ సమయంలో భారతీయ సినిమా ముఖచిత్రం భారీ మార్పులను చవిచూసిందని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు. బాలీవుడ్ సినిమా ప్రధానంగా మ్యూజిక్ కంపెనీలు సినిమాలకు నిధులు సమకూర్చే దశలోకి ప్రవేశించిందని, ‘మైనే ప్యార్ కియా’ మూవీ ఇందుకు చక్కటి ఉదాహరణ అని పేర్కొన్నాడు. అయితే, దక్షిణ భారత సినీ పరిశ్రమలు మాత్రం అమితాబ్ బచ్చన్ శైలిని వదల్లేదని, ఇదే సమయంలో మాస్-ఎంటర్టైన్‌మెంట్ ఫార్మాట్‌లో సినిమాలు నిర్మించిందని చెప్పాడు. ‘మసాలా’ సినిమాలను నిర్మిస్తూనే దక్షిణాది ఇండస్ట్రీ ముందుకు సాగిందన్నాడు. ఈ తరహా సినిమాలుగా తీయడం దక్షిణాది ఎప్పుడూ ఆపలేదని, ప్రముఖ దక్షిణ నటుల స్టార్‌డమ్‌ను స్థిరపరచడంలో మసాలా సినిమాలు కీలకమయ్యాయని వర్మ అభిప్రాయపడ్డారు.