Balakrishna Boyapati combonition announce Birthday special:
నందమూరి బాలకృష్ణకు ఈ మధ్య అన్నీ కలిసొస్తున్నాయి. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న బాలయ్య బాబు నెక్ట్స్ మూవీ ఏమిటా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిన్నటి అసెంబ్లీ ఎన్నికలలో హిందూపురం నుంచి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయం అందుకున్నారు బాలయ్య. ఇప్పుడు బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో మూడు హిట్లు సాధించిన ఈ హిట్ కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అటు సినిమాలతో, ఇటు రాజకీయంగా, బోయపాటితో అనూహ్యంగా మూడు విజయాలను సొంతం చేసుకున్న బాలయ్య బాబు నాలుగవ విజయంపై కన్నేశారు.
బాలయ్య పుట్టినరోజు
సోమవారం నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు . ఇప్పుడు నాలుగోసారి ఈ మాస్ కాంబో రిపీట్ కానుంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు విషెస్ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బోయపాటితో సినిమాను అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. బీబీ-4 అనే వర్కింగ్ టైటిల్‌తో ఇది తెరకెక్కనుంది. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట దీని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి బాలయ్య కూతురు తేజస్విని కూడా నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. 2021లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అఖండ. బాలయ్యబాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచింది. దీనికి సీక్వెల్ ఉంటుందని బోయపాటి గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీబీ4 గా ‘అఖండ’నా లేదంటే కొత్త సినిమానా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవల ఈ సీక్వెల్ గురించి బోయపాటి మాట్లాడుతూ..‘‘ ఎన్నికల హడావిడి పూర్తయ్యాక ‘అఖండ2’ పై అధికారిక ప్రకటన ఉంటుంది. ‘అఖండ’లో పసిబిడ్డ.. ప్రకృతి.. పరమాత్మ.. కాన్సెప్ట్‌లనే చూపించాం. దీని సీక్వెల్‌లోనూ సమాజానికి కావాల్సిన ఓ మంచి విషయం ఉంటుంది. దైవత్వం మనందరిలో ఒక భాగం. దాన్ని తెరపై చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు’ అని తెలిపారు. ఇప్పుడు ఎన్నికల హడావిడంతా అయిపోయింది కాబట్టి దీని గురించే ప్రకటన చేశారా అని సినీ ప్రియులు భావిస్తున్నారు.