Post Office Schemes 2025: మహిళల ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కొత్త స్కీములను సైతం స్త్రీల కోసం ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పోస్టాఫీస్ సైతం.. మహిళలు స్వావలంభన కోసం అధిరిపోయే స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా.. మహిళలు తమ భవిష్యత్తుకు భరోసా కల్పించుకోవచ్చు. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ట్యాక్స్ నుంచి మినహాయింపు సైతం పొందవచ్చు. ఇంతకీ పోస్టాఫీసులో మహిళల కోసం తీసుకొచ్చిన టాప్ స్కీమ్స్ ఏంటీ? వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటీ? ఇప్పుడు చూద్దాం.
1. సుకన్యా సమృద్ధి యోజన (SSY)
బాలికల భవిష్యత్తుకు భద్రత కల్పించే ఉద్దేశంతో ఈ పథకం (Sukanya samriddhi yojana) ప్రారంభించబడింది. 10 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయి పేరుపై తల్లిదండ్రులు/గార్డియన్స్ పెట్టుబడి పెట్టవచ్చు. కనీస వార్షిక డిపాజిట్ రూ.250 కాగా.. గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టిన దానిపై సంవత్సరానికి 8.2% వడ్డీ లభిస్తుంది. అయితే బాలికకు 21 ఏళ్లు నిండేవరకూ డబ్బులు ఉపసంహరించుకోవడానికి వీలు ఉండదు. అయితే అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత విద్యా ఖర్చుల కోసం సేవింగ్స్ లో కొంత భాగం డ్రా చేసుకునేందుకు వీలు కల్పించారు. సుకన్న స్కీమ్ లో పెట్టే పెట్టుబడికి సెక్షన్ 80C క్రింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
2. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD)
ఈ పథకం (Post Office Recurring Deposit Scheme) అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ.. మహిళలకు అధిక లబ్ది చేకూరనుంది. ఈ స్కీమ్ లో కనీస డిపాజిట్ రూ.100 కాగా ఐదేళ్ల కాలానికి ఎంతైన పెట్టుబడి పెట్టవచ్చు. సంవత్సరానికి 6.7% వడ్డీ లభించనుంది. అయితే తొలి మూడేళ్లు పెట్టిన పెట్టుబడి ఉపసంహరించుకునేందుకు వీలు ఉండదు. మూడేళ్ల తర్వాత అత్యవసరం అనుకుంటే డబ్బు మెుత్తాన్ని డ్రా చేసుకోవచ్చు. అయితే పెనాల్టీ విధించబడుతుంది.
3. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS)
ఉద్యోగ విరమణ పొందిన మహిళలు, గృహిణులకు ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోపడనుంది. వ్యక్తిగతంగా రూ.9 లక్షల వరకు జాయింట్ అకౌంట్ అయితే రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. నెలవారీగా 7.4% వడ్డీ లభిస్తుంది. కాలపరిమితి 5 సంవత్సరాలు. పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
4. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)
60 ఏళ్లు పైబడిన మహిళలకు ఇది అనుకూలమైన పథకం. గరిష్టంగా రూ.30 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. సంవత్సరానికి 8.2% వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్ కు 5 ఏళ్ల కాలపరిమితిని నిర్ణయించారు. 80C కింద పన్ను మినహాయింపునకు అర్హత కలిగి ఉండటం సానుకూల అంశం. రిటైర్మెంట్ తర్వాత సురక్షిత ఆదాయం కోరే మహిళలకు ఇది ఉత్తమమైన స్కీమ్ గా చెప్పవచ్చు.
Also Read: Smallest Vande Bharat: వందే భారత్ రైళ్లకు కజిన్స్ ఉన్నాయని తెలుసా? సేమ్ సేమ్ బట్ డిఫరెంట్!
పోస్టాఫీసులో పెట్టుబడి ఎందుకు పెట్టాలి?
స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టడం కంటే పోస్టాఫీసులో డబ్బును పొదుపు చేయడం చాలా సురక్షితం. ప్రభుత్వ హామీ ఉండటంతో తక్కువ రిస్క్ ఉంటుంది. అంతేకాదు క్రమం తప్పకుండా స్థిరమైన వడ్డీ అందుతుంది. ఫిక్స్ డ్ డిపాజిట్లపై బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్ల కంటే పోస్టాఫీసు అధికంగా చెల్లిస్తుండటం మరో సానుకూల అంశం. అంతేకాకుండా సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే విధంగా.. తక్కువ కనీస డిపాజిట్ సౌకర్యం పోస్టాఫీసు స్కీమ్స్ అందిస్తున్నాయి. దీంతో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడంలో పోస్టాఫీస్ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.