Smallest Vande Bharat: భారతీయ రైల్వేలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పెద్దఎత్తున ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా సర్వీసులను నడుపుతున్నాయి. జులై విడుదలైన గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 144 వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. వీటిలో చాలా వరకూ 16 కోచ్ లతో ప్రయాణిస్తున్నాయి. ఎంతో వేగంగా ప్రయాణికులను తమ గమ్యానికి చేరుస్తున్నాయి. అయితే వందేభారత్ రైళ్లలో చాలా మందికి తెలియని 8 ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. అవి మిగతా వాటితో పోలిస్తే.. చాలా తక్కువ బోగీలను మాత్రమే కలిగి ఉన్నాయి. దీంతో వాటిని వందే భారత్ కు కజిన్స్ గా రైల్వే ప్రయాణికులు అభివర్ణిస్తుంటారు.
స్మాల్ వందే భారత్ రైళ్ల ప్రస్థానం
రైల్వే మంత్రిత్వ శాఖ ప్రచార విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ వివరాల ప్రకారం.. మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 2019 ఫిబ్రవరిలో ఢిల్లీ – వారణాసి మార్గంలో 16 కోచ్‌లతో ప్రారంభమైంది. ఈ రూట్‌లో 100% కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ రావడంతో మరో తొమ్మిది మార్గాల్లో వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టబడ్డాయి. కొన్ని రూట్లలో ప్రయాణికుల స్పందన అధికంగా ఉండగా కొన్ని చోట్ల నిరాశ కలిగించింది. ఈ వ్యత్యాసం కారణంగా చిన్న పరిమాణంలో అంటే 8 కోచ్‌లతో వందే భారత్ రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకున్నారు.
తొలుత ఆ మార్గంలో పరుగులు
దేశంలో అత్యంత చిన్న వందేభారత్ రైలును 2023 జూన్ లో బెంగళూరు–ధారవాడ్ మార్గంలో పరుగులు పెట్టించారు. అలా మెుదటి సారి 8 కోచ్ ల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైంది. ఈ మార్గంలో 16 కోచ్ ట్రైన్ అవసరం లేదని రైల్వే శాఖ అధ్యయనంలో తేలడంతో, ప్రయోగాత్మకంగా 8 కోచ్ రైలు సర్వీసులను ప్రవేశపెట్టడం గమనార్హం.
40 మార్గాల్లో.. 8 కోచ్ వందే భారత్
ఈ విధానాన్ని అనుసరించి ప్రస్తుతం సుమారు 40 మార్గాల్లో 8 కోచ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. వాటిలో బిలాస్పూర్ – నాగ్‌పూర్, గాంధీనగర్ – ముంబై సెంట్రల్, సికింద్రాబాద్ – విశాఖపట్నం, నాగ్‌పూర్ – సికింద్రాబాద్, షిర్డీ – ముంబై సెంట్రల్, కాచిగూడ – యశ్వంత్‌పూర్ వంటి మార్గాలు ఉన్నాయి.
Also Read: Telangana Politics: బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని బండి సుధాకర్ డిమాండ్
ప్రయాణికుల సామర్థ్యం ఎంత?
8-కోచ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 572 సీట్లు ఉంటాయి. అందులో 6 చైర్‌కార్ కోచ్‌లు, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయి. ప్రతి చైర్‌కార్‌లో 78 సీట్లు.. ప్రతి ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో 52 సీట్లు ఉంటాయి. మొత్తం 572 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించగలరు. మెుత్తంగా 16 కోచ్ ల వందేభారత్ తరహాలోనే ఈ స్మాల్ ట్రైన్స్ సేవలు అందించనున్నాయి. అదే వేగంతో ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చనున్నాయి. కాకపోతే తక్కువ కోచ్ లు ఉండటం ఒక్కటే వీటి మధ్య వ్యత్యాసంగా చెప్పవచ్చు.