TCS: కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 12 వేల మందిని తొలగించబోతున్నట్టుగా ఇటీవలే బ్యాడ్ న్యూస్ చెప్పిన దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ (Tata Consultancy Services).. తాజాగా అదిరిపోయే గుడ్‌న్యూస్ ప్రకటించింది. కంపెనీ మొత్తం సిబ్బందిలో సుమారుగా 80 శాతం మందికి జీతాల పెంచబోతున్నట్టుగా తెలిపింది. శాలరీ హైక్ పొందనున్న వారిలో ఎక్కువగా మిడ్ లెవల్, జూనియర్ స్థాయి ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 2 శాతం మందిని తొలగించేందుకు సిద్ధమైన తరుణంలో జీతాల పెంపు నిర్ణయం సంస్థ సిబ్బందిని, ఐటీ రంగ వర్గాలను ఒకింత సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తోంది.
జీతాల పెంపు 2025 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని టీసీఎస్ తెలిపింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఆగస్టు 6న కంపెనీ ఉద్యోగులకు ఒక ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది. హ్యూమన్ రిసోర్సెస్ చీఫ్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్, సీహెచ్ఆర్‌వో (డిజిగ్నేట్) సుదీప్ పేరిట ఈ-మెయిల్స్‌ను పంపించారు.
మెయిల్‌లో ఏముంది?
జీతాల పెంపునకు సంబంధించిన వివరాలను ఈ-మెయిల్‌లో టీసీఎస్ వివరించింది. ‘‘సీ3ఏ గ్రేడ్, దానికి సమానమైన ఇతర గ్రేడ్‌ల వరకు అర్హత ఉన్న ఉద్యోగులందరికీ జీతాల సవరణ ఉంటుందని తెలిపింది. జీతాల పెంపు నిర్ణయాన్ని ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉన్నామని యాజమాన్యం తెలిపింది. జీతాల పెంపు నిర్ణయం మొత్తం ఉద్యోగులలో 80 శాతం మందిని కవర్ చేస్తుందని, జీతాల పెంపు నిర్ణయం 2025 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని వివరించింది. టీసీఎస్ భవిష్యత్తును కలిసికట్టుగా నిర్మించుకుంటున్న క్రమంలో ఉద్యోగులు చూపిస్తున్న నిబద్ధత, శ్రమ విషయంలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. అయితే, జీతాల పెంపు ఏ మేరకు ఉంటుందనే వివరాలను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.
Read Also- PM Modi: డైరెక్ట్‌గా డొనాల్డ్ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ
భారీగా ఉద్యోగుల తొలగింపు
జీతాల పెంపు నిర్ణయం కంపెనీకి చెందిన ఎక్కువ మంది ఉద్యోగులను ఆనంద పరిచే విషయమే అయినప్పటికీ, దాదాపు 2 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకబోతున్నట్టు ఇటీవలే టీసీఎస్ ప్రకటించింది. 2 శాతం అంటే, ఏకంగా 12 వేల మంది ఉద్యోగులను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఈ నిర్ణయానికి మిడ్, సీనియర్ లెవల్ ఉద్యోగులు అధికంగా ప్రభావితం కానున్నారు.
భవిష్యత్ కార్యాచరణకు సిద్ధంగా ఉండేలా సంస్థను రూపాంతరం చెందించే క్రమంలో ఉన్నామని, ఉద్యోగుల తొలగింపు నిర్ణయం అందుకేనని గత నెలలో విడుదల చేసిన ప్రకటనలో టీసీఎస్ వివరణ ఇచ్చింది. మార్పులలో భాగంగా నూతన సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు, కొత్త మార్కెట్లలోకి ప్రవేశం, కంపనీ క్లయింట్లకు, సంస్థకు ఏఐ వినియోగాన్ని విస్తృతం చేయడం వంటి చర్యలు చేపడతామని వెల్లడించింది. భారతీయ, గ్లోబల్ భాగస్వాములను పటిష్టం చేసే ప్రయత్నాలు కూడా ఉంటాయని, తగిన మౌలిక సదుపాయాల కల్పన, వర్క్‌ఫోర్స్ మోడల్స్‌ను తిరిగి సృష్టించడం వంటి అనేక వ్యూహాత్మక చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటనలో కంపెనీ పేర్కొంది.
భవిష్యత్ కార్యచరణకు అవసరమైన మార్పుల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే కొన్ని రీ-స్కిల్లింగ్ (పునఃశిక్షణ), రీడిప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ను టీసీఎస్ కొనసాగిస్తోంది. అందుకే, సంస్థ అవసరాలకు సరిపడని ఉద్యోగులను ఇకపై పక్కన పెట్టాల్సి ఉంటుందని తెలిపింది.
Read Also- CPI Narayana: ఆ విషయం చిరంజీవి విజ్ఞతకే వదిలేస్తున్నా.. అంతు చూస్తా అంటూ వార్నింగ్!