CPI Narayana: సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి విషయం జరుగుతున్నా.. ఇతర పొలిటికల్ లీడర్స్ ఏమోగానీ, కచ్చితంగా సీపీఐ నారాయణ మాత్రం స్పందిస్తుంటారు. బిగ్ బాస్ షో మొదలయ్యే ప్రతిసారి ఆయన మీడియా ముందుకు వచ్చి.. కేసులు వేస్తున్నట్లుగా ప్రకటిస్తూనే ఉంటారు. షో ఆపాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. ఆ షో ఆగింది లేదు.. ఆయన మీడియా సమావేశాలు ఆగిందీ లేదు. ఇది నిరంతరం జరిగేదే అన్నట్లుగా చూస్తున్న వారు ఆయన తీరుపై ఫిక్సయ్యారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సినీ కార్మికుల సమ్మె (Cine Workers Strike) జరుగుతున్న విషయం తెలిసిందే. కార్మికుల సైడ్ స్టాండ్ తీసుకుంటూ.. తాజాగా నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. మధ్య చిరంజీవి పేరు కూడా తేవడంతో.. ఆయన మీడియా సమావేశం ఇప్పుడు హైలైట్ అవుతోంది.
ఈ సందర్భంగా సీపీఐ నారాయణ (CPI Narayana) మాట్లాడుతూ.. ‘‘సినీ కార్మికులు మీ ఆస్తులు ఏం రాసివ్వమని అనడం లేదు.. వారికి వేతనాలు పెంచమని మాత్రమే అడుగుతున్నారు. వారిని కాదని బాంబే నుంచి రెడ్ లైట్ ఏరియా వారిని తెప్పించుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే.. ఇక్కడి కార్మికుల పొట్టగొట్టి అక్కడి కార్మికులను తెచ్చుకుంటే మాత్రం ఒక్కొక్కరి అంతు చూస్తాం. ఈ ఇష్యూలో మేము కార్మికుల వైపు నిలబడతాం, అవసరమైతే పోరాటాలు సాగిస్తాం. ప్రస్తతం సినిమా ఇండస్ట్రీ మొత్తం పది మంది కుటుంబాల చేతుల్లో ఉంది. హీరోలు వాళ్లే, దర్శకులు వాళ్లే, ప్రొడ్యూసర్లు వాళ్లే. అలాగే సినిమా థియేటర్లు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. సినిమా థియేటర్లు కొంతమంది చేతుల్లో ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిన నగ్న సత్యమే. ఇప్పుడా పది కుటుంబాలే ముఖ్యమంత్రిని కూడా శాసిస్తున్నాయి.
Also Read- Tollywood Hero: ‘జయం’ సినిమాకు రిజిక్ట్ చేశారు.. కట్ చేస్తే, ఇప్పుడు పాన్ ఇండియా ఆ హీరోకి దాసోహం!
ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలోని పెద్దల్ని, నిర్మాతలను ఒక్కటే అడుగుతున్నా.. కార్మికులు లేకుండానే స్టార్లు, స్టార్ ప్రొడ్యూసర్లు అయ్యారా? నిర్మాతలంతా కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారని తెలిసింది. ఆయన ఇంటికి వెళ్లడమంటే పులికి పాలు పోయడమే. అయినా కార్మికులతో మాట్లాడకుండా చిరంజీవి (Megastar Chiranjeevi) ఇంటికి వెళ్ళడం వల్ల ఏం లాభం? పులికి మేకలను అప్పజెప్పడానికే వెళ్లారా? ఈ మధ్య నా గురించి గురించి ఎక్కడపడితే అక్కడ చెబుతున్నారు. గతంలో చిరంజీవిపై వాస్తవాలు మాట్లాడాను తప్పితే.. తప్పుగా ఏం మాట్లాడలేదు. నేను మాట్లాడిన మాటలకు క్యాస్ట్ జోడించి తప్పుడు ప్రచారాలు చేశారు. దానిని పదే పదే చెప్పుకోవడం ఏంటో మరి. అది చిరంజీవి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇప్పటికైనా పాత వీడియోలు సోషల్ మీడియా నుంచి తొలగించాలి, లేదంటే నేను యాక్షన్‌లోకి దిగాల్సి వస్తుంది.
Also Read- Chiranjeevi: రాజకీయాల్లో లేకపోయినా నాపై విమర్శలు.. అయినా ఎందుకు స్పందించనంటే?
తెలుగు రాష్ట్రాల్లో వాళ్ల హక్కు కోసం కళామతల్లి బిడ్డలు పొట్ట చేత పెట్టుకొని ఆందోళన చేస్తున్నారు. ఒక్కరికీ మనసు కరగడం లేదు. కళామతల్లి బిడ్డలైన కార్మికుల సమస్యలను వెంటనే సానుకూలంగా పరిష్కరించాలి. ప్రస్తుతం వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు.. ప్రభుత్వాలు కూడా మళ్లీ వారికే రాయితీలు ఇస్తున్నాయి. ఈ మధ్య టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇస్తూ.. బ్లాకులో అమ్ముకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తున్నాయి. ఇన్ని రాయితీలు పొందుతున్నరు.. కార్మికులు 30 శాతం వేతనాలు పెంచమని అడిగితే పెంచరా..? బడా బడా వ్యాపారవేత్తలు, బడా బడా ప్రొడ్యూసర్లు మాత్రమే ముఖ్యమంత్రికి కనిపిస్తారా? కార్మికులు, వారి కష్టాలు కనిపించవా..? సినీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి నేరుగా చొరవ చూపాలి. పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి వంటి వారు సినిమాలు తీస్తే ప్రోత్సాహం ఉండదు, అసలు సినిమా థియేటర్లు దొరకవు. అందుకే చెబుతున్నా.. సినీ కార్మికుల పొట్ట కొట్టడం సరైన పద్ధతి కాదు. వెంటనే ఈ సమస్యపై సరైన నిర్ణయం తీసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో స్కిల్స్ లేవని కొందరు నిర్మాతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కచ్చితంగా కార్మికులు కోరుకుంటున్నట్లుగా పెద్ద సినిమాలకు 30 శాతం వేతనాలు పెంచాల్సిందేనని మేము డిమాండ్ చేస్తున్నాము’’ అని ఫైర్ అయ్యారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు