Stock Markets Crash: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం నాడు భారీ ఒడిదొడుకులకు (Stock Markets Crash) గురయ్యాయి. లాభాల స్వీకరణ, అమెరికా ఫెడరల్ బ్యాంక్ (US Fed) భేటీ నేపథ్యంలో అప్రమత్తత, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) పెట్టుబడుల ఉపసంహరణ వంటి ప్రధాన కారణాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. ఉదయం 85,624 పాయింట్ల వద్ద ఓపెన్ అయిన బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) మధ్యాహ్న సమయంలో దాదాపు 800 పాయింట్ల మేర పతనమయ్యింది. కనిష్ఠంగా 84,875 మార్క్‌ను తాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 సూచీ (NSE Nifty) కూడా అదే రీతిలో 280 పాయింట్లకు పైగా నష్టపోయి 25,902.95 దిగువకు చేరింది. ఈ భారీ పతనం స్టాక్ మార్కెట్ల మదుపర్లను తీవ్ర నష్టాల్లో ముంచింది. అయితే, సోమవారం ట్రేడింగ్ చివరిలో మార్కెట్లు కాస్తం కోలుకున్నాయి.
ఇన్వెస్టర్లకు రూ.7 లక్షల కోట్ల నష్టం
సోమవారం నాడు మార్కెట్ల భారీ పతనం దేశీ మదుపర్లను తీవ్ర నష్టాల్లో ముంచింది. మార్కెట్లు గరిష్ఠ స్థాయిలో పతనమైన సమయంలో ఇన్వెస్టర్ల సంపద సుమారుగా రూ.7 లక్షల కోట్ల మేర కరిగిపోయి ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మిడ్ క్యాప్,, స్మాల్ క్యాప్ సూచీలు దగ్గరదగ్గరగా 2 శాతం నుంచి 4 శాతం వరకు దిగజారాయని, ప్రధాన సూచీలపై ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషిస్తున్నారు.
Read Also- Bigg Boss 9 Telugu: ప్రోమో అదిరింది.. పోగొడుతూనే హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్
పతనానికి 4 ప్రధాన కారణాలు!
సోమవారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్లు పతనమవడానికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది లాభాల స్వీకరణ. ఇటీవల దేశీ మార్కెట్లు రికార్డులు సృష్టిస్తూ సరికొత్త గరిష్ఠ స్థాయిలను తాకాయి. కొన్ని రంగాల స్టాక్‌లు ఇన్వెస్టర్లకు లాభాల పంటలు పండించాయి. దీంతో, బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టార్ రంగాల స్టాక్స్‌లో లాభాలను స్వీకరించేందుకు ఇన్వెస్టర్లు సోమవారం నాడు మొగ్గుచూపారు. దీంతో, మార్కెట్ల పతనానికి దారితీసింది. రెండవ కారణం, అమెరికన్ ఫెడ్ నిర్ణయంపై మార్కెట్లలో ఆందోళనలు కనిపిస్తున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ వారంలోనే వడ్డీ రేట్లను సమీక్షించి నిర్ణయాలు వెల్లడించనుంది. దీంతో, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వడ్డీ రేట్ల తగ్గించవచ్చనే అంచనాలు ఉన్నప్పటికీ, ప్రకటన గ్యారంటీగా ఉంటుందనే నమ్మకం లేకపోవడంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా కూడా పడింది.
మరో ముఖ్య కారణంగా, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (FII) పెద్ద సంఖ్యలో తమ పెట్టుబడులను ఉపంసహరించుకుంటున్నారు. భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి గత కొన్ని వారాలుగా నిరంతరంగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండడం (స్టాక్స్ సేల్స్) మార్కెట్లను ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. ఒక్క డిసెంబర్ మొదటి వారంలోనే ఏకంగా రూ.11,820 కోట్లకు పైగా విలువైన షేర్లను ఎఫ్ఐఐలు విక్రయించినట్లు అంచనాగా ఉంది. మరోవైపు, అంతకంతకూ బలహీనపడుతున్న రూపాయి మారకం విలువ కూడా ఈ అమ్మకాల జోరుకు ఆజ్యం పోసిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
లాభనష్టాలు ఎలా ఉన్నాయంటే..
రంగాల వారీగా చూస్తే రియల్టీ, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, మీడియా, మెటల్, ఆటో వంటి రంగాల సూచీలు గణనీయం పడిపోయాయి. రియల్టీ సూచీ అత్యధికంగా దాదాపు 4 శాతం వరకు దిగజారింది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 28 స్టాక్స్ నష్టపోయాయి. భారీగా పడిపోయిన కొన్ని స్టాక్స్ విషయానికి వస్తే, బెల్(BEL), బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఎస్‌బీఐ ఎక్కువగా నష్టపోయిన స్టాక్స్ జాబితాలో ఉన్నాయి. అయితే, మార్కెట్లలో తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ ఐటీ రంగానికి చెందిన కొన్ని స్టాక్స్ గ్రీన్‌లో ముగిశాయి. ఆ జాబితాలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ ఉన్నాయి.

