Sedan SUVs – GST: చిన్న కార్లు, బైక్స్ తో పాటు ఖరీదైన సెడాన్లు, ఎస్ యూవీ కార్ల ధరలు సైతం గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎస్ యూవీలపై విధిస్తున్న 50 శాతం జీఎస్టీని.. సంస్కరణల్లో భాగంగా 40 శాతానికి తగ్గించాలని ఆర్థిక శాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అధిక ధర వాహనాలపై జీఎస్టీతో పాటు కొత్త సెస్ విధించే అవకాశం కూడా ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
వివరాల్లోకి వెళ్తే..
గురువారం రేట్ రేషనలైజేషన్ (Rate Rationalisation) పై మంత్రుల ప్యానెల్ సమావేశం (Ministerial Panel Meeting) జరిగింది. కొన్ని రాష్ట్రాలు 40% పన్నుపై అదనంగా సెస్ వేయాలని డిమాండ్ చేశాయి. ప్రస్తుతం 4 మీటర్ల కంటే పొడవైన సెడాన్లు, SUVలు, నిర్దిష్ట స్థాయి ఇంజిన్ కెపాసిటీ ఉన్న వాహనాలపై 28% జీఎస్టీ, 22% సెస్ అమలులో ఉన్నాయి. వీటన్నింటిని కలుపుకొని ఆ కార్లపై పన్ను 50 శాతానికి చేరుకుంది. అయితే కార్ల పన్నుపై సవరణలు, రాష్ట్రాల అభిప్రాయాలపై వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ (GST Council) తుది నిర్ణయం తీసుకోనుంది.
వచ్చే నెలలో తుది నిర్ణయం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అధ్యక్షతన జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో లగ్జరీ కార్లపై 40 శాతానికి పన్ను పరిమితం చేసే అవకాశముందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న సెస్ పై ప్రస్తుతానికి కేంద్రం అసంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నాయి. ఒకవేళ 40 శాతానికే పన్ను ఖరారు అయితే.. ప్రస్తుతమున్న ఎస్ యూవీ (SUV), సెడాన్ (Sedan) కారు ధరలు భారీగా తగ్గే అవకాశముందని పేర్కొంటున్నారు. ఉదాహరణకు రూ.10 లక్షల కారును కొనుగోలు చేస్తే అది రూ. లక్ష వరకూ ఆదా కానుంది. అదే రూ.15 లక్షల కారు తీసుకుంటే రూ.1.5 లక్షలు తగ్గనుంది. వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
ఎలక్ట్రిక్ వాహనాలకు దెబ్బ!
ఇదిలా ఉంటే చిన్న కార్లు, బైక్స్ పై ప్రస్తుతమున్న 28% పన్నును.. 18%కి తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంధనంతో నడిచే వాహనాలపై పన్ను తగ్గడం వల్ల.. ప్రస్తుతం 5 శాతం జీఎస్టీ మాత్రమే ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలకు అవి దగ్గరగా రానున్నాయి. అదే జరిగితే ఎలక్ట్రిక్, డీజిల్ వాహనాల మధ్య పన్ను తేడా 13 శాతానికి తగ్గిపోనుంది. దీని వల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తగ్గొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల విషయంలో ఈవీ వెహికల్స్ పై పెను ప్రభావం పడొచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read: Viral Video: తిందామని చూసిన యువతిని.. గుక్కపెట్టి ఏడ్చేలా చేసిన రొయ్య.. వీడియో వైరల్
శ్లాబుల సర్దుబాటు ఎలాగంటే?
ప్రధాని మోదీ పంద్రాగస్టు ప్రసంగంలో భాగంగా ఎర్రకోట నుంచి త్వరలో చేపట్టబోయే జీఎస్టీ సంస్కరణల గురించి ప్రస్తావించారు. ఈసారి దేశ ప్రజలకు దీపావాళి బొనాంజా ఇవ్వబోతున్నట్లు చెప్పారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర ఆర్థిక శాఖ సైతం జీఎస్టీ సంస్కరణ దిశగా అడుగులు ప్రారంభించింది. జీఎస్టీలో ప్రస్తుమున్న 5% 12%, 18%, 28% శాబుల్లో రెండింటిని ఎత్తివేసి.. 5%, 18% మాత్రమే ఉంచాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్ కు ప్రతిపాదనలు పంపింది. వాటి ప్రకారం.. ప్రస్తుతం ఉన్న 28% స్లాబ్‌లోని 90% వస్తువులు 18% స్లాబ్‌కి మార్చబడతాయి. 12% స్లాబ్‌లోని 99% వస్తువులు 5% స్లాబ్‌కి మారతాయి.