RBI Gold Loan Rules: అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చే రుణ మార్గాల్లో బంగారం ముందు వరుసలో ఉంటుంది. ఇంట్లో బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం ద్వారా రుణాన్ని పొందే వీలు ఉంటుంది. అయితే బంగారు రుణాల్లో జరుగుతున్న అవతకతవకల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) ఇటీవల కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. బంగారు రుణాల ప్రక్రియను మరింత పారదర్శకంగా, సురక్షితంగా ఉంచేందుకు కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇవి బ్యాంకులు, నాన్ – బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs), కో-ఆపరేటివ్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకుల (RRBs) వంటి అన్నింటికి వర్తిస్తాయని చెప్పింది. అయితే ఈ కొత్త నిబంధనలు చిన్న మొత్తాల రుణాలు తీసుకునే సామాన్యులపై ప్రభావం చూపవచ్చనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Ministry of Finance).. ఆర్బీఐకి కీలక సూచనలు చేసింది. ఇంతకీ ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలు (RBI Guidelines) ఏంటి? కేంద్రం కోరిన మినహాయింపు ఏంటి? అందుకు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
RBI కొత్త మార్గదర్శకాలు
RBI జారీ చేసిన డ్రాఫ్ట్ మార్గదర్శకాలలోని కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. బంగారు రుణాల కోసం లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తిని 75% ఆర్బీఐ పరిమితం చేసింది. అలాగే తనఖా పెట్టేందుకు బంగారం ఆభరణాలు తీసుకొచ్చే వారి పూర్తి నేపథ్యాన్నీ తనిఖీ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరింది. తాకట్టు పెట్టే బంగారం ఎవరిది అనేది నిర్ధారించుకోవాలని బ్యాంకులకు సూచించింది. బంగారం రుణ గ్రహీతకే చెందిందా అని నిర్ధారించుకోవాలని చెప్పింది. అంతేకాదు బంగారం స్వచ్ఛత, బరువును కూడా కచ్చితత్వంతో కొలుచుకోవాలని సూచించింది. ఒక్కో రుణ గ్రహీతకు కిలో బంగారం, 50 గ్రాముల బంగారు నాణేలు మాత్రమే హామీగా అంగీకరించాలని బ్యాంకులకు సూచించింది. సంబంధింత వ్యక్తులు తీసుకునే రుణంపై పర్యవేక్షణ ఉండాలని.. వ్యక్తిగత, వ్యాపార అవసరాలకు ఒకేసారి రుణం తీసుకోవడం నిషేధమని సూచించింది.
గోల్డ్ రూల్స్ మార్చడానికి కారణాలేంటి?
గతేడాది సెప్టెంబర్ నుంచి బ్యాంకుల వద్ద బంగారం రుణాలు 50 శాతం మేర పెరిగినట్లు తెలుస్తోంది. ఇతర లోన్స్ తో పోలిస్తే గోల్డ్ లోనే రుణ వృద్ధి గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తాకట్టు పెడితే అధిక మెుత్తంలో రుణంగా పొందవచ్చన్న అభిప్రాయం చాలా మందిలో పెరుగుతున్నట్లు ఆర్బీఐ గుర్తించింది. అంతేకాదు నిరర్ధక ఆస్తులు (Non performing assets) గోల్డ్ లోన్స్ లో గణనీయంగా పెరగడాన్ని ఆర్బీఐ వర్గాలు నోటీస్ చేశాయి. గత 12-16 నెలల్లో చేపట్టిన ఆడిట్లలో గోల్డ్ లోన్ ప్రాసెస్‌లో పలు నిబంధనల ఉల్లంఘనలు బయటపడినట్లు తెలుస్తోంది. బంగారం ఆభరణాల స్వచ్ఛత, తూకం వేయడం వంటివి బ్యాంకులు చేయడానికి బదులుగా.. వాటిని ఫిన్‌టెక్ ఏజెంట్లు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే కచ్చితంగా నిబంధనలు పాటించేలా చూడాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Raja Singh Threat: ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాణాలకు ముప్పు.. వరుసగా బెదిరింపు కాల్స్!
కేంద్రం మినహాయింపు కోరడానికి కారణాలు
గోల్డ్ లోన్స్ పై ఆర్బీఐ తీసుకొచ్చిన మార్గదర్శకాలపై సామాన్యుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చిన్న మెుత్తంలో రుణం తీసుకోవాలని భావించే వారు ఎక్కువగా గోల్డ్ లోన్ పైనే ఆధారపడుతున్నారు. కొత్త నిబంధనల వల్ల బంగారం పెట్టి రుణం తీసుకునే ప్రక్రియ మరింత సంక్లిష్టం అవుతుందని గ్రామీణ, పట్టణ ప్రాంత వాసులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై తమిళనాడు సీఎం ఎం.కె స్టాలిన్ సైతం ఆర్బీఐ మార్గదర్శకాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)కు సైతం లేఖ రాశారు. కఠినమైన నిబంధనల కారణంగా ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బ తీస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు సామాన్యులతో పాటు రాజకీయంగా కేంద్రంపై ఒత్తిడి పెరగడంతో కేంద్రం స్పందించింది. రూ. 2 లక్షల వరకు బంగారు రుణాలు తీసుకునే వారికి నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్బీఐని కోరింది. కొత్త మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో అమలుచేసేందుకు సమయం పడుతుంది కాబట్టి.. 2026 జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమలుచేయాలని ఆర్‌బీఐకి ఆర్థికశాఖ సూచించింది. దీనిపై ఆర్బీఐ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.