Mohandas Pai: భారత దేశంలో యువత ఎక్కువ గంటలు పని చేయాలని నారాయణ మూర్తి ఇటీవల చేసిన కామెంట్స్ పై పెద్ద చర్చ జరుగుతుండగా, మాజీ ఇన్ఫోసిస్ టాప్ ఎగ్జిక్యూటివ్, ప్రస్తుతం ఆరీన్ క్యాపిటల్ చైర్మన్ అయిన మోహన్ దాస్ పాయ్ కీలక వివరణ ఇచ్చారు. మూర్తి సూచించిన 70–72 గంటల పని సలహా సాధారణ ఉద్యోగులు, బ్యాంకు సిబ్బంది, ప్రభుత్వ సిబ్బందికి సంబంధించినది కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
నారాయణ మూర్తి కామెంట్స్ పై మోహన్ దాస్ కౌంటర్
“ఇది అందరికి కాదు.. కొత్తవి సృష్టించాలనుకునే ఇన్నోవేటర్లు, స్టార్టప్ ఫౌండర్లకే ఇచ్చిన సలహా,” మాత్రమే అని పాయ్ అన్నారు. మూర్తి ఇన్ఫోసిస్ CEOగా ఉన్న సమయంలో ఆయన CFOగా పనిచేశారు. చైనా “9-9-6” మోడల్‌ను ఆదర్శంగా తీసుకుని మూర్తి చెప్పారు. ఇటీవల ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మూర్తి మరోసారి 2023లో చేసిన 70 గంటల వర్క్‌వీక్ గురించి మరోసారి ప్రస్తావించారు. చైనాలోని “9-9-6” (ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, వారం 6 రోజులు) పని భారతీయ యువతకు ఓ బెంచ్‌మార్క్ కావాలని ఆయన సూచించారు. ఇది మొత్తం 72 గంటల పని వారానికి సమానం.
ఘాటుగా ప్రశ్నిస్తున్న విమర్శకులు
మూర్తి వ్యాఖ్యలపై వెంటనే విమర్శలు వెల్లువెత్తాయి. చైనా నిషేధించిన పద్ధతిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? చైనా 2021లో “9-9-6” మోడల్‌ను ఉద్యోగుల ఆరోగ్య సమస్యలు కారణంగా నిషేధించిందని విమర్శకులు గుర్తుచేశారు. భారతీయ ఉద్యోగులు ఇప్పటికే ఎక్కువ పని గంటలు చేస్తున్నారు, కానీ అదనపు పారితోషికం లేకుండా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయని కూడా పలువురు పేర్కొన్నారు.
“బిల్డర్లకు మాత్రమే మూర్తి సలహా” – మోహన్ దాస్ పాయ్ స్పష్టం
పూర్తి వివరణ ఇస్తూ మోహన్ దాస్ పాయ్ ఇలా చెప్పారు. “ స్టార్టప్ ఫౌండర్‌గా ఏదైనా గొప్పదాన్ని నిర్మించాలని మీరు నిర్ణయించుకుంటే, మీరు కష్టాన్ని కూడా భరించాలి. అలాంటి వారికే ఈ సలహా. సాధారణ ఉద్యోగులకు కాదు.” అంతేకాక, ఇటువంటి వ్యక్తులకు సంప్రదాయ వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ “ఓవర్‌రేటెడ్” అని ఆయన వ్యాఖ్యానించారు. “మీరు ఎదుటివారికంటే ముందుకు వెళ్లాలంటే, కష్ట పడాలి.. కృషి చేయాలి. ఆ కృషిలోనే అసలు ఫలితం ఉంటుంది” అని పాయ్ అన్నారు.

