H1B Visa Fee: అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులకు అత్యంత కీలకమైన హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు (H1B Visa Fee) పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, విదేశీయులను పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేసుకునే అమెరికన్ కంపెనీలకు ఈ పరిణామం భారంగా మారుతుందని అంటున్నారు. అయితే, అధిక ఫీజు అవరోధాన్ని అధిగమించేందుకు, భారతదేశాన్నే కేంద్రంగా చేసుకొని, కార్యకలాపాలు కొనసాగించాలని (Indian IT Industry) యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీలు యోచిస్తున్నాయని ఐటీ నిపుణులు, ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ ఆలోచన చేస్తున్న కంపెనీల సంఖ్య పెరిగిందని అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీసీసీలు (గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్) సగం భారతదేశంలోనే ఉండడం, సాంకేతిక సాయంతో పాటు ఏఐ (కృత్రిమ మేధస్సు), ఔషధాల పరిశోధన వంటి అత్యంత విలువైన రంగాల్లో భారత్ ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతుండడం ఆకర్షణీయంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌లో 1,700కు పైగా జీసీసీలు ఉన్నాయని, ఇవి ఇప్పటికే టెక్ సపోర్ట్ దశ దాటిపోయి, లగ్జరీ కార్ల డాష్‌బోర్డుల డిజైన్ నుంచి ఔషధ ఆవిష్కరణల వరకు విస్తరించాయని, వినూత్నానికి కేంద్రాలుగా మారిపోయాయని ‘రాయిటర్స్’ కథనం పేర్కొంది.
Read Also- Quetta Blast: పాకిస్థాన్‌లో శక్తివంతమైన కారుబాంబు పేలుడు.. 13 మంది దుర్మరణం
అమెరికన్లు చేయాల్సిన ఉద్యోగాలను విదేశీయులు చేస్తున్నారని, దీనికి అడ్డుకట్ట వేసేందుకుగానూ ఈ నెల ప్రారంభంలో ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. దీంతో, కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తులు చేసుకునేవారిపై 100,000 డాలర్ల ఫీజులు (సుమారు రూ.88.6 లక్షలు) విధించారు. అంతక్రితం ఫీజు కేవలం 1,500–4,000 (రూ. 1.3 – 3.5 లక్షలు) ఉండగా, ఇప్పుడది ఏకంగా 70 రెట్లకు పైగా పెరిగింది. కాగా, అమెరికా ఉద్యోగాలు ఇతర దేశాల వారు చేస్తున్నారని, ఈ పరిణామం జాతీయ భద్రతకు ప్రమాదకరమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయన ప్రకటన చేసిన తర్వాత ఐటీ పరిశ్రమలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
Read Also- Kodama Simham: మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ కౌబాయ్ మూవీ ‘కొదమసింహం’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్!
కాగా, భారతదేశంలోని గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (GCCs) అంతర్జాతీయ నైపుణ్యాలు, శక్తివంతమైన లీడర్‌షిప్‌తో అత్యంత ముఖ్యమైన వ్యాపార కార్యకలాపాలకు ముఖ్య కేంద్రాలుగా ఎదుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. డెలాయిట్ ఇండియాలో భాగస్వామిగా, జీసీసీ ఇండస్ట్రీ నాయకుడిగా ఉన్న రోహన్ లోబో మాట్లాడుతూ, ఇండియాలోని జీసీసీలు.. అమెరికా సంస్థల వ్యూహాత్మక మార్పును గమనించి, ముందుండి నడిపించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ప్రత్యేక సందర్భానికి సరిపోయే సంఖ్యలో జీసీసీలు ఉన్నాయని, కంపెనీలకు ఇవి అంతర్గత ఇంజిన్లుగా పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక అమెరికా కంపెనీలు తమ మానవవనరుల అవసరాలను పునఃపరిశీలన చేస్తూ, భారత్‌లోని కార్యకలాపాలను తరలించే ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయని లోబో వివరించారు.