Gold ETFs: ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి బంగారాన్ని ఉత్తమ ఎంపికలలో ఒకటిగా పెట్టుబడిదారులు పరిగణిస్తున్నారు. బంగారాన్ని భౌతిక రూపంలో కొనడానికి ఇష్టపడని వారు, సేఫ్టీ భయాలు ఉన్నవారు.. గోల్డ్ ఈటీఎఫ్ (Gold Exchange Traded Funds)లు నమ్మకమైన పెట్టుబడులుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 2025లో గోల్డ్ ఈటీఎఫ్.. గత 5 నెలలతో పోలిస్తే అత్యధిక రాబడిని నమోదు చేశాయని తాజా నివేదిక వెల్లడించింది.
613% వృద్ధి రేటు
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) డేటా ప్రకారం.. జూన్ నెలలో గోల్డ్ ETFలు రూ. 2,080.85 కోట్ల నికర ఇన్ఫ్లోను సాధించాయి. ఇది మే నెలలో వచ్చిన రూ. 292 కోట్లతో పోలిస్తే ఆరు రెట్లు అధికం. అంటే దాదాపు 613% వృద్ధి రేటును నమోదు చేసింది. అంతేకాదు జనవరి 2025 తర్వాత అత్యధిక నెలవారీ ఇన్ఫ్లోగా జూన్ నెల నిలిచింది. ఈ గణనీయమైన పెరుగుదలకు కారణాలు.. బంగారం ధరలలో స్థిరత్వం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఈక్విటీ అండ్ ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ మార్కెట్లలో అస్థిరతలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు జీవితకాల గరిష్ట స్థాయులకు సమీపంలో ఉండటం కూడా పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచిందని పేర్కొంటున్నారు.
రూ.8,000 కోట్లకు పైగా..
గోల్డ్ ఈటీఎఫ్ లు.. బంగారం ధరలను ట్రాక్ చేసే పెట్టుబడి సాధనాలుగా ఉన్నాయి. ఇవి భౌతిక బంగారాన్ని నిల్వ చేయకుండానే పెట్టుబడి పెట్టే అవకాశాన్ని అందిస్తాయి. దీంతో పెట్టుబడి దారులు గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గత జూన్ నెలలో కొత్తగా రెండు గోల్డ్ ఈటీఎఫ్ లు వచ్చి చేరడంతో రూ. 41 కోట్ల అదనపు పెట్టుబడిని రాబట్టగలిగాయి. 2025 ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం గోల్డ్ ఈటీఎఫ్ ఇన్ఫ్లోలు రూ. 8,000 కోట్లను దాటాయి. దీన్ని బట్టి పెట్టుబడి దారులు ఏ స్థాయిలో గోల్డ్ ఈటీఎఫ్ పై ఇన్ వెస్ట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. గోల్డ్ ఈటీఎఫ్ ల ఆస్తుల నిర్వహణ (AUM) జూన్ చివరి నాటికి రూ. 64,777 కోట్లకు చేరింది. ఇది మే నెలలో వచ్చిన రూ. 62,453 కోట్లతో పోలిస్తే గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.
గోల్డ్ ఈటీఎఫ్ వల్ల లాభాలు
గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs)లో పెట్టుబడి పెట్టడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయకుండా లేదా నిల్వ చేయకుండా బంగారం ధరలను ట్రాక్ చేసే సులభమైన మార్గాన్ని ఇవి అందిస్తాయి. ఇవి స్టాక్ ఎక్స్చేంజ్‌లలో షేర్లలాగా ట్రేడ్ అవుతాయి. దీనివల్ల కొనుగోలు, విక్రయం సులభం. భౌతిక బంగారంతో పోలిస్తే.. గోల్డ్ ఈటీఎఫ్ లు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. మేకింగ్ ఛార్జీలు, నిల్వ ఖర్చులు, లాకర్ ఛార్జీలు వంటివి ఉండవు. ఇవి స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ అవుతాయి కాబట్టి అధిక లిక్విడిటీని అందిస్తాయి. పెట్టుబడిదారులు మార్కెట్ గంటలలో ఎప్పుడైనా తమ యూనిట్లను సులభంగా కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు.
Also Read: Alia Bhatt: అలియాకు బిగ్ షాక్.. రూ.77 లక్షలు స్వాహా.. ఇలా కూడా మోసపోతారా?
బంగారం ధరలతో లింకప్!
గోల్డ్ ఈటీఎఫ్ లు బంగారం ధరలకు నేరుగా లింక్ చేయబడి ఉంటాయి. ఇవి రోజువారీ మార్కెట్ ధరల ఆధారంగా నిర్వహించబడతాయి. దీనివల్ల పెట్టుబడి విలువలో పారదర్శకత ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్ లు.. చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని అందిస్తాయి. ఒక గ్రాము బంగారం ధరతో సమానమైన ఒక యూనిట్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. ఆర్థిక అనిశ్చితులు, ద్రవ్యోల్బణం, లేదా భౌగోళిక రాజకీయ సంక్షోభాల సమయంలో బంగారం సాధారణంగా స్థిరమైన ఆస్తిగా పనిచేస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్ లు ఈ ప్రయోజనాన్ని సులభంగా ఉపయోగించుకునే మార్గాన్ని పెట్టుబడిదారులకు అందిస్తాయి.