Personal Finance: మన దేశ ఫైనాన్షియల్ రంగంలో (Personal Finance) అందరికీ అందుబాటులో ఉన్న రెండు పాపులర్ పెట్టుబడి విధానాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు), మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు (SIPలు) ప్రధానమైనవని చెప్పుకోవచ్చు. అనాదిగా అందుబాటులో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల విధానంలో కస్టమర్లకు గ్యారంటీ, భరోసా లభిస్తాయి. వడ్డీ రూపంలో ఎంతోకొంత కచ్చితంగా లాభం లభిస్తుంది. అయితే, పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మ్యూచువల్ ఫండ్స్ చక్కటి లాభాలను అందించగలవు. ఈ కారణంగానే సిప్‌లకు (SIPs) ఇటీవల బాగా ఆదరణ పెరుగుతోంది. నిజం చెప్పాలంటే పెట్టుబడులకు ఎఫ్‌డీలు, సిప్‌లు రెండూ ముఖ్యమైనవే. అయితే, త్వరగా కోటీశ్వరులుగా మారే విషయానికి వస్తే ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యమివ్వాలి? అనేది చాలా ముఖ్యం. రెండింట్లో ఏది ఉత్తమం, దేనిలో ఎక్కువ లాభాలు వస్తాయి?, నష్టాలు ఏమిటి? అనేవి తెలుసుకొని అడుగులు వేయాలి.
ఎఫ్‌డీల ప్రయోజనాలు, నష్టాలు ఇవే
ఫిక్స్డ్ డిపాజిట్లు ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రధాన కారణం ఎలాంటి రిస్క్ లేకపోవడమే. ఒక వ్యక్తి తన వద్ద ఉన్న డబ్బును ఏకమొత్తంలో ఒకేసారి బ్యాంకు లేదా ఫైనాన్సియల్ సంస్థలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా హామీ ఇచ్చిన బ్యాంక్ వడ్డీ రేటు ప్రకారం ఆదాయం లభిస్తుంది. కాబట్టి, పిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి రాబడి గ్యారంటీగా ఉంటుంది. అయితే, తక్కువ లాభాలు రావడం ఎఫ్‌డీలలో ఉన్న ప్రధాన సమస్య. జీవన ప్రమాణాలకు అనుగుణంగా, పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టుగా లాభాలు అందించడంలో ఎఫ్‌డీలు అంచనాలను అందుకోలేవనే చెప్పాలి. ద్రవ్యోల్బణం రేటు కంటే తక్కువ ఆదాయం లభిస్తుంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు సాధారణంగా 5 నుంచి 10 ఏళ్ల కాలపరిమితిపై 6 శాతం, 7 శాతం మధ్య వార్షిక వడ్డీ రేట్లను అందిస్తుంటాయి.
Read Also- Uddhav-Raj: ఒక్కటైన థాక్రే బ్రదర్స్.. 20 ఏళ్లక్రితం అసలు ఎందుకు విడిపోయారో తెలుసా?
మ్యూచువల్ ఫండ్స్ సిప్‌ల పరిస్థితి ఏంటి?
మ్యూచువల్ ఫండ్స్ ట్రాక్ రికార్డులను పరిశీలిస్తే దీర్ఘకాలికంగా 12 శాతం నుంచి 15 శాతం వరకు వార్షిక ఆదాయాన్ని అందించడం సర్వసాధారణం. అయితే, సిప్‌లు (SIP) స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులకు గురయ్యే అవకాశం ఉందని ప్రతి ఇన్వెస్టర్ తప్పక తెలుసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ రూపంలో పెట్టుబడులపై సగటు లాభాలు వచ్చినా ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగా మంచి ఆదాయం లభిస్తుంది. ఎఫ్‌డీలతో పోల్చితే గణనీయ మొత్తంలో రాబడిని పొందే అవకాశం ఉంటుంది.
త్వరగా కోటీశ్వరులవ్వాలంటే?
రూ.10 వేలు సిప్ ఇన్వెస్ట్‌మెంట్, రూ.10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ ఈ రెండింట్లో ఏ మార్గంలో త్వరగా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉందో, ఆర్థిక నిపుణులు ఏమంటున్నారో ఒకసారి పరిశీలిద్దాం. ఎఫ్‌డీలు అయినా, మ్యూచువల్ ఫండ్ అయినా కోటీశ్వరులు కావాలంటే దీర్ఘకాల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
Read Also- Google Map: గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మితే కొంప కొల్లేరే.. ఇది తెలిశాక జన్మలో జోలికెళ్లరు!
ఎఫ్‌డీ అంచనా
కాలపరిమితి : 35 సంవత్సరాలు
పెట్టుబడి మొత్తం : రూ.10 లక్షలు
రాబడి : 7 శాతం వడ్డీ (అంచనా)
వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం : రూ.96.76 లక్షలు
నికర మొత్తం : రూ. 1.06 కోట్లు
మ్యూచువల్ ఫండ్ అంచనా
కాలవ్యవధి: 21 సంవత్సరాలు
నెలవారీ సిప్ మొత్తం: రూ.10,000
రాబడి: ఏడాదికి 12 శాతం వృద్ధి (అంచనా)
మొత్తం పెట్టుబడి: రూ. 25,20,000
వడ్డీ ద్వారా ఆదాయం: రూ. 79,10,067
నికర మొత్తం: రూ. 1.04 కోట్లు
పైన అంచనాలను పోల్చి చూస్తే ఎఫ్‌డీలలో పెట్టుబడుల కంటే సిప్‌లలోనే వేగంగా కోటీశ్వరులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, సిప్‌ల లాభాలు దేశీయ స్టాక్ మార్కెట్లో పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. అయితే, దీర్ఘకాలంపాటు పెట్టుబడులు పెట్టేవారు, రిస్క్ అయినా ఫర్వాలేదు అనుకునేవారు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. సిప్‌లలో ఇన్వె్స్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఫైనాన్సియల్ నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఇక, ఎఫ్‌డీలు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. అదే సమయంలో ఆదాయానికి భరోసా ఉంటుంది.