Auto Industry: ప్రస్తుతం GST 2.0 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రూ.2,500 కోట్లు విలువైన కంపెన్సేషన్ సెస్ క్రెడిట్లు ల్యాప్ అయ్యే పరిస్థితి ఏర్పడటంతో, ఆటో పరిశ్రమ ప్రతినిధులు ప్రభుత్వ జోక్యాన్ని కోరారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన ప్రీ-బడ్జెట్ సమావేశంలో SIAM సహా పలువురు ఆటో రంగ సంస్థలు ఈ అంశాన్ని తీవ్రంగా ప్రస్తావించాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా ఎంటరప్రైజ్‌లుగా ఉన్న ఆటో డీలర్లు తమ లెడ్జర్లలో ఉన్న సెస్ బ్యాలెన్సులు కొత్త GST 2.0 నిబంధనల ప్రకారం కొనసాగించుకునే అవకాశం లేకుండా పోవడంతో భారీ నష్టానికి గురయ్యే ప్రమాదం ఉందని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
సెప్టెంబర్ 22న కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తరువాత పాత క్రెడిట్లు ఉపయోగించుకునే అవకాశం లేనందున, వేలాది MSME డీలర్లు బాదుడుకు గురవుతారని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. “మాకు సంస్కరణలకు వ్యతిరేకం కాదు, కానీ న్యాయం కావాలి” అని తమ పిటిషన్‌లో పేర్కొన్న FADA, ఈ సమస్య వల్ల దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లు తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో పడతాయని హెచ్చరించింది. దీనికి ముందు సంస్థ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా లేఖ రాసి సహాయం కోరింది.
ప్రీ-బడ్జెట్ చర్చల్లో కంపెన్సేషన్ సెస్ సమస్యతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, GST పోర్టల్ సమస్యలు వంటి పలు అంశాలను కూడా ఇండస్ట్రీ ప్రతినిధులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
Also Read: Labour Policy: దేశంలో పని దొరికే అవకాశాలు పెరిగాయా.. 29 చట్టాల విలీనం తర్వాత వచ్చిన భారీ మార్పులు?
ఇక మరోవైపు, ఆటో ఇండస్ట్రీలో పాజిటివ్ సిగ్నల్స్ కూడా కనిపిస్తున్నాయి. అక్టోబర్ 2025లో భారత ప్యాసింజర్ వెహికిల్ (PV) మార్కెట్ ఇప్పటివరకు లేనంతగా రికార్డు సేల్స్ సాధించింది. GST రేట్ రేషనలైజేషన్, దసరా-దీపావళి పండుగల డిమాండ్ కలిసివచ్చి ఈ వృద్ధికి కారణమయ్యాయి. అక్టోబర్ 2024తో పోల్చితే ఈ సంవత్సరం PV హోల్‌సేల్స్ 17.23% వృద్ధితో 4,70,227 యూనిట్లకు చేరాయి. ఇది 2025 జనవరిలో నమోదైన 4,05,522 యూనిట్ల రికార్డును కూడా అధిగమించింది.

